కరోనా నుంచి సినీ పరిశ్రమ ఏమీ నేర్చుకోలేదా?

January 05, 2022


img

కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన వాటిలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లు మూతపడటం, తెరుచుకొన్న తరువాత కరోనా మళ్ళీ మళ్ళీ ఏదో రూపంలో వచ్చి పోతుండటంతో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపలేని పరిస్థితి, అధికార పార్టీల రాజకీయ నిర్ణయాలతో నష్టాలు, సమస్యలు, మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్‌ దెబ్బకు థియేటర్లు మూతపడుతుండటం వంటివి సినీ పరిశ్రమను కోలుకోలేని విదంగా దెబ్బ తీస్తున్నాయని చెప్పవచ్చు. 

వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఏళ్ళ తరబడి పాన్ ఇండియా మూవీలుగా తీసిన ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ చిత్రాలు ఇండస్ట్రీ మనుగడకు అతి ముఖ్యమైన ఈ సంక్రాంతి పండుగ సీజనులో రిలీజ్ చేసుకోలేకపోవడం గమనిస్తే నానాటికీ పరిస్థితులు ఎంత దయనీయంగా మారుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

అయితే మన సినీ నిర్మాతలకు, సినీ నిర్మాణ సంస్థలకు, దర్శకులకు, నటీనటులకు దేశంలో, యావత్ ప్రపంచంలో నెలకొన్న ఈ పరిస్థితుల గురించి తెలియావా? మరి కొన్నేళ్ళపాటు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చని తెలియకనే వారు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఏళ్ళ తరబడి షూటింగ్ చేస్తూ ఎందుకు సినిమాలు తీస్తున్నారు?అంటే వీటి గురించి మనకంటే వారికే చాలా బాగా తెలుసని అందరికీ తెలుసు. అయినా ఎందుకు వారి తీరు మార్చుకోవడం లేదు? అనే సందేహం కలుగక మానదు. బహుశః తమ సినిమా షూటింగ్ పూర్తయ్యి అవి విడుదలయ్యే సమయానికి పరిస్థితులు చక్కబడుతాయనే ఆశావాదం కావచ్చు. ఆశావాద దృక్పదం చాలా మంచిదే కానీ వాస్తవ పరిస్థితులను  పరిగణనలోకి తీసుకోవడం కూడా అంతే అవసరం. 

ఇప్పట్లో కరోనా మహమ్మారి ఈ లోకాన్ని...మనుషులను విడిచిపెట్టదని... అది ఏదో రూపంలో వచ్చి పలకరించి వెళుతుంటుందని స్పష్టమైంది. కనుక ఈ సమస్యను అధిగమించి సినీ పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఒక్కటే దారి కనిపిస్తోంది. 

పెద్ద సంస్థలు, పెద్ద నిర్మాతలు, పెద్ద నటీనటులు అందరూ కూడా తక్కువ బడ్జెట్‌తో...తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీస్తూ పరిస్థితులు ఏమాత్రం బాగున్నా వెంటనే తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడం మంచిది. వీలైతే ఓటీటీలకు తగ్గ సినిమాలు చేసుకోవడం మంచిది. 

చిన్న సినీ నిర్మాతలు ఈ ఫార్ములానే పాటిస్తూ ఈ కరోనా విపత్కాలంలో కూడా లాభాలతో బయటపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక పెద్ద నిర్మాతలు, పెద్ద సంస్థలు, పెద్ద నటీనటులు అందరూ కూడా కరోనా నేర్పుతున్న ఈ గుణపాఠాలను నేర్చుకొని తదనుగుణంగా మారితేనే సినీ పరిశ్రమ మనుగడ సాగించగలదు లేకుంటే కష్టమే.


Related Post