గోటితో పోయేదానిని టిఆర్ఎస్‌ గొడ్డలి వరకు తెచ్చుకొందా?

January 05, 2022


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ తాజా పర్యటన, సిఎం కేసీఆర్‌పై విమర్శలను గమనిస్తే టిఆర్ఎస్‌ ప్రభుత్వం గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకొందా? అనే సందేహం కలుగక మానదు. నిజానికి బండి సంజయ్‌ జాగరణ దీక్ష చేయడం వలన టిఆర్ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా కరోనా ఆంక్షల పేరుతో అడ్డుకొని, అరెస్ట్ చేయించి జైలుకి పంపించింది. 

ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుని ఇటువంటి చిన్న సాకుతో అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం ఎంత వరకు సబబు?దాంతో టిఆర్ఎస్‌ ఏం సాధించింది?అంటే ఏమీ కనబడదు. ఈ అరెస్ట్ వలన బండి సంజయ్‌కు ప్రజలలో సానుభూతి ఏర్పడే అవకాశం ఉంది. పైగా బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యేవరకు ప్రతీరోజు ధర్నాలు, ర్యాలీలు చేయాలని బిజెపి నిశ్చయించుకొంది. జేపీ నడ్డాతో సహా రాష్ట్ర బిజెపి నేతలు చేసిన హడావుడి చూస్తే దీనిపై టిఆర్ఎస్‌ కంటే బిజెపికే రాజకీయంగా మైలేజీ లభించిందని అర్ధమవుతోంది. ఇదీగాక నేడో రేపో లేకుంటే 14 రోజుల తరువాతో బండి సంజయ్‌ బెయిల్‌పై బయటకు రావడం ఖాయం. అప్పుడు ఆయన కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరగడం ఖాయం. అంటే టిఆర్ఎస్‌ వ్రతం చేసినా ఫలం దక్కలేదని అర్దమవుతోంది. 

అసలు రాష్ట్రంలో బిజెపికి అనుకూల వాతావరణం ఏర్పడాలంటే ఇటువంటి పరిణామాలే చాలా అవసరం కూడా. కనుక బండి సంజయ్‌ అరెస్టును ఆయనతో సహా బిజెపి నేతలు పైకి ఖండిస్తున్నప్పటికీ లోలోన వారు దీనిని స్వాగతిస్తున్నారని భావించవచ్చు. 

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని, బిజెపిని గట్టిగా నిలదీసి కాస్త పైచేయి సాధించిన టిఆర్ఎస్‌, బండి సంజయ్‌ అరెస్టుతో చేజేతులా బిజెపికి అవకాశం కల్పించినట్లయింది. ఈ అవకాశాన్ని బిజెపి చక్కగా వినియోగించుకొందనే చెప్పవచ్చు. అంటే ఈవిషయంలో బిజెపిని దెబ్బ తీయబోయి టిఆర్ఎస్‌ ఎదురుదెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. 

ఏది ఏమైనప్పటికీ, ప్రతిపక్ష నేతలను చీటికి మాటికీ అరెస్ట్ చేయడం, వారి నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ప్రజలు కూడా హర్షించకపోవచ్చు.


Related Post