పసలేని జేపీ నడ్డా వాదనలు

January 05, 2022


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న హైదరాబాద్‌ వచ్చి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేసి విచ్చలవిడిగా దోచుకొంటూ దానిని సిఎం కేసీఆర్‌ ఏటీఎంలా వాడుకొంటున్నారు. ఆ ప్రాజెక్టు వలన కేసీఆర్‌ ఫాంహౌసుకు నీళ్ళు వెళ్ళాయేమో కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు ఇవ్వలేకపోయారు. మిషన్ భగీరధ కూడా కమీషన్ల కొరకే తప్ప దాని ద్వారా ప్రజలకు ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. కేసీఆర్‌ అవినీతి ముసుగును తొలగిస్తాం. రాష్ట్రంలో ఆయన నిరంకుశ, నియంతృత్వ, కుటుంబ పాలనను అంతమొందిస్తాం,” అని అన్నారు. 

కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని జేపీ నడ్డా చెపుతున్నప్పుడు ఇంతవరకు కేంద్రప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించడం లేదు? విచారణ జరిపించుకోమని సిఎం కేసీఆర్‌తో సహా అందరూ సవాల్ విసురుతున్నారు కదా? 

కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాతే రాష్ట్రంలో ఒక్కసారిగా ధాన్యం ఉత్పత్తి పెరిగి చివరికి కేంద్రప్రభుత్వం కూడా దానిని కొనలేక చేతులెత్తేయడం అందరికీ తెలుసు. కాళేశ్వరంతోనే రాష్ట్రంలో పలు జిల్లాలలో నీళ్లు పారుతున్నాయనే సంగతి రాష్ట్ర బిజెపి నేతలందరికీ తెలుసు. 

మిషన్ భగీరధలో కొన్ని లోటుపాట్లు జరిగి ఉండవచ్చు కానీ అమలవుతోందని అందరికీ తెలుసు. కేంద్రప్రభుత్వం సైతం కాళేశ్వరం, మిషన్ భగీరధలను పలుమార్లు ప్రశంసించింది. కానీ ఈ విషయాలు జేపీ నడ్డాకి తెలియకనే విమర్శలు చేస్తున్నారనుకోలేము. అంటే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయంగా దానిపై పైచేయి సాధించడానికే జేపీ నడ్డా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనుకోవలసి ఉంటుంది.


Related Post