హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో సిఎం కేసీఆర్ మొదలు గల్లీ స్థాయి వరకు టిఆర్ఎస్‌లో అందరూ దళిత బంధు పధకం గురించే గట్టిగా మాట్లాడుతుండేవారు. ఆ తరువాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్‌లో అందరూ ధాన్యం కొనుగోలు సమస్య గురించే మాట్లాడేరు. కానీ ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పధకం అమలుచేస్తుందా లేదా? ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం అయిపోయిందా? లేక ఇక్కడితో ఈ అంశాన్ని టిఆర్ఎస్ పక్కన పెట్టేసిందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లు రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కొనుగోలుచేయలేమని కేంద్రప్రభుత్వం పదేపదే చెప్పింది కనుక ఈ సమస్య పరిష్కారం కాలేదని స్పష్టం అయ్యింది. మరి ధాన్యం కొనుగోలు సమస్యపై టిఆర్ఎస్ హటాత్తుగా ఎందుకు సైలెంట్ అయిపోయింది?సిఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడంతో ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి లేదా ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే ధాన్యం కొనుగోలు అంశంతో కేంద్రంపై బురద జల్లుతున్నారని బిజెపి నేతలు వాదించారు. ఈ సమస్యపై టిఆర్ఎస్ సైలెంట్ అయిపోవడం చూస్తే వారి వాదనలు నిజమే అనిపిస్తాయి.
ఏది ఏమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్ళ కోసం ఎదురుచూస్తున్న రైతుల పరిస్థితి ఏమిటి?వారిని ఎవరు ఆదుకొంటారు?కేంద్రప్రభుత్వమా లేదా రాష్ట్ర ప్రభుత్వమా?