ఇప్పుడు డిజిటల్ వాచ్‌ల స్థానంలో స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయి. రూ.600 నుంచి రూ.15 వేలు వరకు అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి. రూ. 2,400 పెడితే నాయిస్ ఫిట్, బోట్ వంటి మంచి కంపెనీ వాచీలే అందుబాటులోకి వచ్చేశాయి. స్మార్ట్ వాచ్‌లలో కూడా సెల్ ఫోన్‌లలోలాగే అనేక ఫీచర్స్, ఉపయోగాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు చాలా మంది వీటిని కొంటున్నారు.
స్మార్ట్ వాచ్ ఉపయోగాలు ఎన్నో...
ఆరోగ్యం: ఇప్పుడు చాలా స్మార్ట్ వాచ్‌లలో టైమ్ అండ్ డేట్ వగైరాలతో పాటు శరీరంలో బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ శాతం వగైరా వివరాలు తెలుసుకొనే వెసులుబాటు ఉంటోంది. అలాగే మనం ఎంతసేపు నిద్రపోయాము?మళ్ళీ ఎంతసేపు గాడనిద్రలో ఉన్నాము?నిద్రలేమి వంటి వివరాలను కూడా రికార్డ్ చేసి చూపిస్తాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ద ఉన్నవారి కోసం వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, బ్రీతింగ్, యోగా వగైరాలను మానిటర్ చేసే ఫీచర్స్ ఉన్నాయి. అంటే వాటిని మనం ఎంతసేపు చేశాము? వాటి వలన మన శరీరంలో ఎన్ని కెలోరీలు ఖర్చు అయ్యాయి? అవి చేస్తున్నపుడు మన హార్ట్ బీట్, బీపీ, ఆక్సిజన్ లెవెల్స్ ఏవిదంగా ఉన్నాయి? మొదలైన వివరాలన్నీ ఈ స్మార్ట్ వాచ్‌లు చూపిస్తాయి. ఇవి మన మొబైల్ ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా అనుసంధానించుకోవలసి ఉంటుంది కనుక ఆ వివరాలన్నీ మొబైల్ ఫోన్‌లో భద్రపరుచుకోవచ్చు. అవసరమనుకొంటే బంధుమిత్రులు లేదా వైద్యులతో షేర్ చేసుకోవచ్చు కూడా.
ఫోన్ కాల్స్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఫీచర్స్: ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్‌లో ఈ ఫీచర్స్ అన్ని చాలా కామన్ అయిపోయాయి. స్మార్ట్ వాచ్ పెట్టుకొంటే ఇవన్నీ చేతిమీదే ఉన్నట్లు లెక్క.
ఫేసస్: సాధారణంగా ఏ వాచ్‌కైనా ఒకటే డయల్ (ఫేస్) ఉంటుంది. దానిని చూసుకొనే వాచ్ కొనుకొంటాము. కానీ స్మార్ట్ వాచ్‌లో అలా కాదు...కనీసం 50 నుంచి 100 రకాల డయల్స్ పెట్టుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇంకా కావాలనుకొంటే మన ఆత్మీయుల ఫోటోలను, మనకు నచ్చిన దేవుడు, జంతువులు, ప్రకృతి ఫోటోలను, సినిమా హీరో,హీరోయిన్ల ఫోటోలను ఏవైనా వాల్ పేపర్‌గా పెట్టుకోవచ్చు.
ఇంత తక్కువ ధరలో ఇన్ని ఉపయోగాలున్న స్మార్ట్ వాచ్‌లు లభిస్తున్నందునే అందరూ వీటిని విరివిగా కొంటున్నారు. ఇప్పటి వరకు వీటి ఫీచర్స్, ఉపయోగాలు చెప్పుకొన్నాము. వీటిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకొంటే మనకి స్మార్ట్ వాచ్ ఎంత అవసరం అనే విషయం అర్ధమవుతుంది.
స్మార్ట్ వాచ్ ఇబ్బందులు ఎన్నో...
• వాచ్ బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవకుండా ఉండేందుకు ఇవి ఎప్పుడూ స్లీప్-మోడ్‌లోనే ఉంటాయి. కనుక మామూలు వాచ్‌లలో టైమ్ చూసుకొన్నట్లు వీటిలో టైమ్ చూసుకోలేము. వాచ్ పెట్టుకొన్న చేతిని కదిలిస్తే టైమ్ కనబడుతుంది. అదీ...నాలుగైదు సెకన్ల సేపే! బైక్ లేదా స్కూటీ నడుపుతున్నప్పుడు ఈవిదంగా టైమ్ చూసుకోవడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.
• వీటిని తప్పనిసరిగా మొబైల్ ఫోన్‌కు బ్లూ టూత్ ద్వారా 24 గంటలు కనెక్ట్ అయ్యుండాలి. లేకుంటే కొన్ని ఫీచర్స్ పనిచేయవు.
• ఇప్పటికే మొబైల్ ఫోన్‌లో వైఫై ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంచవలసి వస్తున్నందున ఫోన్ బ్యాటరీ తొందరగా డిస్-ఛార్జ్ అయిపోతుంటుంది. ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల కోసం ఎల్లప్పుడూ బ్లూ టూత్ కూడా ఆన్ చేసి ఉంచితే ఫోన్ బ్యాటరీ ఇంకా తొందరగా డిస్-ఛార్జ్ అయిపోతుందని వేరే చెప్పక్కరలేదు. ఫోన్ బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోతే ఇప్పుడు బ్యాటరీ మార్చుకొనే వెసులుబాటులేదు కనుక కొత్త ఫోన్ కొనాల్సిందే అని అందరికీ తెలుసు.
• స్మార్ట్ వాచ్ వాడాలనుకొనేవారికి తప్పనిసరిగా కాస్త టెక్నాలజీ అంటే సెల్ ఫోన్‌లో దాని యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సెటింగ్స్ చేసుకోవడం, రెంటినీ అనుసంధానం చేసుకొని చూసుకోవడం వంటి కనీస జ్ఞానం ఉండాలి. లేదా అవన్నీ తెలిసి తోడ్పడేవారుండాలి.
• స్మార్ట్ వాచ్ ధరిస్తే దాంతో ఫోన్స్ చేసుకోవచ్చు.. నచ్చిన మ్యూజిక్ వినొచ్చు... వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజులు చూసుకోవచ్చు అనేది ఓ భ్రమ. నేటికీ చాలా స్మార్ట్ వాచ్‌లలో కాల్ వచ్చినప్పుడు అది ఎవరి నుంచి వస్తోందో తెలుపుతూ నోటిఫికేషన్ చూపుతుందే తప్ప వాచ్ నుంచి నేరుగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకోలేము. కొన్ని స్మార్ట్ వాచ్‌లలో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ జేబులో సెల్ ఫోన్... అది బ్లూ టూత్ కనెక్ట్ అయ్యుండాలి.
• స్మార్ట్ వాచ్‌లో ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజులు ఉన్నప్పటికీ వాచ్-మొబైల్ ఫోన్‌తో బ్లూ టూత్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడే వస్తాయి. అంటే మొబైల్ ఫోన్ జేబులోనో..చేతిలోనో తప్పనిసరిగా ఉండాలన్న మాట! చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు కేవలం 1.4 అంగుళాల వెడల్పు ఉండే చిన్న స్క్రీన్ ఉండే స్మార్ట్ వాచ్‌లో మెసేజ్‌లు చూసుకోవలసిన అవసరం ఏమిటి? ఎంచక్కా ఫోన్‌లోనే చూసుకోవచ్చు కదా? ఫోన్‌తోనే మాట్లాడుకోవచ్చు కదా?
• సెల్ ఫోన్‌లాగే స్మార్ట్ వాచ్‌లను కూడా ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేస్తుండాలి లేకుంటే పనిచేయవు.
• పైన చెప్పుకొన్నట్లు మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్‌ను 24 గంటలు చేతికి ధరించాలి. లేకుంటే ఆ ఫీచర్స్ ఉన్నా ఉపయోగం ఉండదు. కానీ 24 గంటలూ చేతికి వాచ్ ధరించడం కష్టమనుకొనేవారు స్మార్ట్ వాచ్ కొనాలనే ఆలోచన మానుకొంటే మంచిది.
కనుక ఇప్పుడు స్మార్ట్ వాచ్ మీకు అవసరమా లేదా?ఉపయోగించగలరా లేదా?అని ఆలోచించుకొని నిర్ణయించుకోండి.