ప్రస్తుతం బిజెపిపై గురి ఎక్కుపెట్టిన టిఆర్ఎస్ ఏ చిన్న అవకాశం వచ్చినా విమర్శలు సందిస్తోంది. ఏపీలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలకు రూ.50 లకే చీప్ లిక్కర్ అందిస్తామని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ “రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తారా? వాట్ ఏ స్కీమ్... వాట్ ఏ షేమ్...ఇదేనా మీ బిజెపి జాతీయ విధానం?అధికారం కోసం ఇంతగా దిగజారిపోవాలా? అధికారంలో లేని రాష్ట్రాలలో ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నారా?” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందిస్తూ, “బిజెపిది చీప్ లిక్కర్ అయితే టిఆర్ఎస్‌ది కాస్ట్లీ లిక్కర్. రెండుపార్టీలకు అదొక్కటే తేడా. తెలంగాణ ప్రభుత్వం యువతను మద్యానికి బానిసలుగా మార్చుతోంది. ప్రతీ ఊర్లో గుళ్ళు, బళ్ళు సమీపంలో, నివాస ప్రాంతాల మద్య లిక్కర్ షాపులు ఏర్పాటు చేస్తూ లిక్కర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకొంటోంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోవడం లేదు,” అంటూ విమర్శలు గుప్పించారు.
మద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల, ఏపీ ప్రభుత్వ మద్యం విధానంపై పల్లెత్తు మాటనకపోవడం ఆమె ద్వందవైఖరికి అద్దంపడుతోంది.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31న అర్దరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తే, ఏపీ ప్రభుత్వం ఇటీవల భారీగా మద్యం ధరలు తగ్గించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం ఉత్పత్తి, వినియోగాన్ని అరికట్టడానికే మద్యం ధరలు తగ్గించామని సమర్ధించుకొంది. అది వేరే విషయం. కానీ మద్యం ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని ఏ ప్రభుత్వమూ వదులుకోబోవని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరూపిస్తున్నాయి.