భారత్‌లో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క కరోనా ఉండనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా ఒమిక్రాన్ వైరస్‌కు కరోనా కంటే వేగంగా వ్యాపించే గుణం ఉంది కనుకనే దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో 2022 మార్చిలోగా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ శాసనసభ ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. కనుక ఎన్నికలు ఒకటి రెండు నెలలు వాయిదా వేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే మరో రెండు నెలలు ఆగితే ఒమిక్రాన్ కేసుల సంక్య ఇంకా పెరిగిపోతుందే తప్ప తగ్గదు కనుక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. అప్పుడే కాంగ్రెస్, బిజెపిలతో సహా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. కనుక తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. కానీ ఎన్నికల సభలు, ర్యాలీలతో ఎన్నికలు మొదలయ్యేలోగానే ఆయా రాష్ట్రాలలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరగవచ్చు. అక్కడి నుంచి దేశమంతటికీ వేగంగా వ్యాపించడం ఖాయం.
కనుక ఆయా రాష్ట్రాలలో 100 శాతం కరోనా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 100 శాతానికి చేరువలో, యూపీలో 85 శాతం, మణిపూర్‌లో 80 శాతం వాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు తెలియజేశారు. కనుక ఆ 5 రాష్ట్రాలలో వీలైనంత తొందరగా 100 శాతం వాక్సినేషన్ పూర్తిచేయాలని ఎన్నికల కమీషన్ సూచించింది.