కాంగ్రెస్‌ జెండా పడిపోయింది....పార్టీ భవిష్యత్‌కు ఇదే సంకేతమా?

December 28, 2021


img

కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేశారు. కానీ గాలిలో ఎగురవలసిన జెండా కింద పడిపోయింది. ఆమె జెండా తాడు లాగుతుండగా ఆమెకు తోడ్పడటానికి వచ్చిన పార్టీ కార్యకర్త కూడా ఆ తాడును బలంగా లాగడంతో జెండా కింద పడిపోయింది. దాంతో సోనియా గాంధీతో సహా అక్కడున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అందరూ నివ్వెరపోయారు. అంతలో ఓ మహిళా కార్యకర్త గబగబా అక్కడకు చేరుకొని సమయస్పూర్తి ప్రదర్శిస్తూ జెండాను విప్పి చెరోవైపు పట్టుకొని ప్రదర్శించడంతో అందరూ ఆ షాక్ నుంచి తేరుకొని ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్...సోనియా గాంధీ జిందాబాద్...’ అంటూ నినాదాలు చేశారు. ఆ తరువాత నిర్వాహకులు జెండాకు మళ్ళీ తాడు కట్టి ఎగురవేశారు.

ఈ ఘటన అనుకోకుండా జరిగినదే కానీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంనాడు..పార్టీ ప్రధాన కార్యాలయంలో... పార్టీ అధ్యక్షురాలి చేతిలోనే...పార్టీ జెండా కిందపడిపోవడం అశుభ సూచకంగా భావించవచ్చు. ఓసారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఇది అర్ధమవుతుంది.  

పార్టీలో సీనియర్ నేతలు నేటికీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కనుక సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వారిని కాదని ఆయన మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టినా వచ్చే ఏడాది జరుగబోయే యూపీ, పంజాబ్, బిహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలరనే నమ్మకం పార్టీలో నేతలకే లేదు. ఎందుకంటే గత పదేళ్ళుగా దేశంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే ఉంది. కనుక ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించకపోవచ్చు. 

బిజెపికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఓ పక్క నాయకత్వ సమస్య వేదిస్తుంటే మరోపక్క నానాటికీ బలహీనపడుతోంది. దీంతో బిజెపి మరింత బలపడగలిగింది. కనుక కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి ప్రాంతీయ పార్టీలు సైతం వెనకాడుతున్నాయి. బిజెపికి కాంగ్రెస్‌ ఇక ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదని సిఎం కేసీఆర్‌, మమతా బెనర్జీ వంటివారు భావిస్తూ కాంగ్రెస్‌ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ ఎంత ఆగమ్యగోచరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనుక ఈ రోజు కాంగ్రెస్‌ జెండా పడిపోవడాన్ని ఆ పార్టీకి అశుభసూచకంగానే భావించవచ్చు.



Related Post