కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారెక్కబోతున్నారా?

December 27, 2021


img

తెలంగాణ కాంగ్రెస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గులాబీ కారులో సీటు కోసం చూస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. మంత్రి కేటీఆర్‌ గురువారం సంగారెడ్డి పట్టణంలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు పర్యటనకు వచ్చినప్పుడు దూరంగా ఉంటూ విమర్శలు గుప్పించే ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంత్రి కేటీఆర్‌ వచ్చినప్పుడు మాత్రం ఆయనతో రాసుకుపూసుకు తిరుగుతూ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం విశేషం. సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్‌ భవనాలకు మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన చేసినప్పుడు జగ్గారెడ్డి పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. 

జగ్గారెడ్డి గతంలోనే టిఆర్ఎస్‌లో చేరే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. కానీ ఎప్పటికైనా పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాలనే ఆలోచనతో వెనక్కు తగ్గారు. కానీ ఆ పదవిని రేవంత్‌ రెడ్డి దక్కించుకోవడంతో అప్పటి నుంచి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా ముందు తన అసంతృప్తిని బయటపెట్టినందుకు మళ్ళీ అధిష్టానం చేత చీవాట్లు తినడంతో పార్టీ పట్ల అసంతృప్తి ఇకా పెరిగి ఉండవచ్చు. ఈరోజు ఎర్రవల్లిలో రేవంత్‌ రెడ్డి నిర్వహించబోయే రచ్చబండ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని జగ్గారెడ్డి చేపడమే ఇందుకు తాజా నిదర్శనం. పార్టీలో రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారు. కనుక మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు జగ్గారెడ్డి ఆయనను ప్రసన్నం చేసుకొని కారెక్కేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారేమో?అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ గులాబీ కారు ఇప్పటికే కిక్కిరిసి పోయుంది కనుక తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జగ్గారెడ్డికి కారులో చోటు కల్పించగలరో లేదో?


Related Post