తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం చాలా విచిత్రమైన సమస్య ఎదుర్కొంటోంది. తెలుగు సినీ పరిశ్రమకు పుట్టినిల్లువంటి ఏపీలో ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ వైఖరి వలన తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండగా, ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సినీ పరిశ్రమకు అత్యంత సానుకూల వాతావరణం నెలకొని ఉంది.
ఏపీ ప్రభుత్వం జీవో:35తో సినిమా టికెట్ ధరలలో భారీగా కోత విధించగా,
సినీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో: 120 జారీ చేసి టికెట్ ధరలు
పెంచుకొనేందుకు అనుమతించింది.
ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమంటూ
థియేటర్ యజమానులు థియేటర్లను మూసుకొంటున్నారు. ఏపీలో నియమనిబందనల పేరిట థియేటర్లను
సీజ్ చేస్తుంటే, తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకొని అదనపు షోలు
వేసుకొనేందుకు కూడా అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలబడుతోంది.
తాజా జీఓ:120 ప్రకారం ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో
టికెట్ కనిష్ట ధర రూ.30 గరిష్ట ధర రూ.150 వసూలు చేసుకొనేందుకు థియేయర్ యజమానులను తెలంగాణ
ప్రభుత్వం అనుమతించింది.
అదేవిదంగా నాన్-ఏసీ థియేటర్లలో టికెట్ కనిష్ట ధర రూ.30 గరిష్ట
ధర రూ.100 ఉంటుంది. మల్టీ ప్లెక్స్ థియేటర్లలో కనిష్ట ధర రూ.100 గరిష్ట ధర రూ.250 ఉంటుంది.
రిక్లెయినర్స్ కోసం రూ.300గా నిర్ణయించింది. అన్ని టికెట్స్ పై జీఎస్టీ,
థియేటర్ నిర్వహణ ఛార్జీలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. టికెట్లపై ఆ వివరాలు వేరువేరుగా
ముద్రించవలసి ఉంటుందని జీవోలో పేర్కొంది.