ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి, సొంత డప్పు కొట్టుకోవడానికి సొంత మీడియా ఎంత ముఖ్యమో ఇప్పుడు అందరికీ తెలిసిందే. వాటి ద్వారా రాజకీయ పార్టీలు తమ సొంత అభిప్రాయాలను, ఆలోచనలను ప్రజాభిప్రాయాలు, ఆలోచనలుగా చలామణి చేస్తుంటాయి. అంతా తమకే అనుకూలంగా ఉందని గట్టిగా చెప్పుకోగలవు. ఒకవేళ ఎదురు దెబ్బలు తగిలితే బాకా మీడియా సాయంతో ప్రజలను సులువుగా పక్కదారి పట్టించగలవు. సొంత మీడియాతో తమ లోపాలను చక్కగా కవర్ చేసుకోగలవు. అవసరమైనప్పుడు తమ రాజకీయ ప్రత్యర్ధులపై బురద జల్లగలవు. అధికార పార్టీకి ఏదైనా ఒక ఆలోచన కలిగితే వెంటనే దాని గురించి సొంత మీడియాలో ప్రజల చెవులు పగిలిపోయేలా గట్టిగా బాకా ఊదుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. సొంత మీడియాతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే రాజకీయ పార్టీలు ముఖ్యంగా...అధికారంలో ఉన్న పార్టీలు సొంత మీడియాను ఏర్పాటు చేసుకొని సొంత డబ్బా వాయించుకొంటున్నాయి.
ఇక సొంత మీడియా ఏర్పాటు చేసుకో(లే)ని రాజకీయ పార్టీలు కులం లేదా మతం ప్రాతిపదికన తమకు కొమ్ముకాసే మీడియా అండదండలతో తమ ప్రత్యర్ధులను ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఏదో పార్టీకి బాకా ఊదకపోతే మీడియా మనుగడ సాగించడం ఈరోజుల్లో చాలా కష్టంగా మారిపోయింది. కనుక అవి కూడా ఏదో ఓ పార్టీకి తోకలా ఉంటూ, ఫక్తూ రాజకీయ పార్టీలాగే వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్పదు. ఏదో ఓ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా, దాని రాజకీయ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా వార్తలు, విశేషణల పేరిట మంచి స్పైసీ కధనాలు వండి వడ్డిస్తుంటే ప్రజలు కూడా వాటిని రుచి చూస్తూనే ఉన్నారు.
ఒకే సమస్యను ఒక మీడియాలో ఒకవిదంగా, మరో మీడియాలో ఇందుకు పూర్తి భిన్నంగా రావడమే ఇందుకు నిదర్శనం. అంటే ప్రజలకు కూడా ‘రాజకీయ ఆప్షన్స్’ ఉన్నాయనుకోవచ్చు. వారు ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని లోకాన్ని చూడాలనుకొంటే అవే పెట్టుకొని చూడవచ్చు. తాము అభిమానించే పార్టీకి బాకా ఊదే మీడియాతో తమ మనసుకు నచ్చిన వార్తాలే వినవచ్చు...చూడవచ్చన్నమాట! రాజకీయ పార్టీల చేత మేనేజ్ చేయబడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇంత స్వేచ్చ ఉండటం చాలా గొప్ప విషయమే కదా?