విద్యార్దులు మా బిడ్డలే..శత్రువులు కారు: మంత్రి సబిత

December 24, 2021


img

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సం. పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్దులందరికీ కనీస మార్కులు ఇచ్చి పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. “తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్, విద్యాశాఖ విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వారు పరీక్షలకు సిద్దమయ్యేందుకు అన్నివిధాల సహకరించాయి. పరీక్షలు వ్రాసేందుకు భయపడుతున్న విద్యార్దులు, ఫెయిల్ అయిన విద్యార్డులు ఒత్తిడి అధిగమించేందుకు సైకాలజిస్టులను కూడా ఏర్పాటు చేశాము. అటువంటివారి కోసమే ప్రత్యేకంగా లెక్చరర్లను కూడా నియమించాము. విద్యార్దులను ఫెయిల్ చేయడానికి వారేమీ మా శత్రువులు కారు. వారు మా బిడ్డలాంటివారే. కానీ కొందరు ఇంటర్ బోర్డు వారిని కావాలనే ఫెయిల్ చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. విద్యార్దుల జీవితంలో ఇంటర్మీడియెట్ చాలా కీలకమైనది... తరువాత వారు అనేక కాంపిటీటివ్ పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. కనుకనే వారికి పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేశాము. ఆ ఉద్దేశ్యంతోనే రెండో సం.వార్షిక పరీక్షలతో పాటు మొదటి సం. ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నాము. 

ప్రభుత్వ కాలేజీలలో చదువుకొంటున్న నిరుపేద విద్యార్దులే ఈ పరీక్షలలో ఫెయిల్ అయ్యారనే వాదన కూడా సరికాదు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో, గురుకుల పాఠశాలలో చదువుకొన్న విద్యార్దులలో చాలామంది మంచి మార్కులతో ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు.  

తల్లితండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. మున్ముందు జీవితానికి ఈ ఈ ఇంటర్మీడియెట్ చాలా కీలకం కనుక విద్యార్దులు కూడా తల్లితండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మరింత శ్రద్దగా, పట్టుదలగా చదివి ఇంటర్ సప్లిమెంటరీ, రెండో సం.పరీక్షలలో మంచి మార్కులు సాధించాలి. 

ఇప్పుడు ధర్నాలు చేసి పరీక్షలు పాస్ అయ్యాము కనుక ప్రతీసారి ఇలాగే చేయవచ్చని విద్యార్దులు అనుకోవద్దు. ఫెయిల్ అయిన విద్యార్దులను పాస్ చేయడం ఇదే చివరిసారని అందరూ గుర్తుంచుకోవాలి, “ అని మంత్రి సబిత ఇంద్రా రెడ్డి విద్యార్దులకు హితవు పలికారు.  



Related Post