శభాష్ టాలీవుడ్‌

December 22, 2021


img

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలప్పుడు నటీనటులందరూ కలిసి తెలుగు సినీ పరిశ్రమ పరువును గంగలో కలిపేశారు. మసక బారిన దాని ప్రతిష్టను టాలీవుడ్‌లోని కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి మళ్ళీ ఇనుమడింపజేశారు.  

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌తో సిద్దమైన ఆర్ఆర్ఆర్ జనవరి 7న రిలీజ్ అవుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించిన రాధేశ్యామ్ జనవరి 14న విడుదలవుతోంది. పవన్‌ కళ్యాణ్‌, రానా ప్రధాన పాత్రలలో భీమ్లా నాయక్ కూడా జనవరి 12న విడుదల కావలసి ఉంది.  నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలలో బంగార్రాజు సినిమా జనవరి 15న విడుదలవుతోంది. 

ఒకే వారంలో అదీ... సంక్రాంతి పండుగ సమయంలో నాలుగు పెద్ద సినిమాలు విడుదలైతే ప్రేక్షకులకు నిజంగా పండగే కానీ వాటి మద్య పోటీ పెరిగి, థియేటర్లు లేక కలెక్షన్స్ తగ్గిపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతారు. కనుక మూడేళ్ళుగా చాలా భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌, రాధే శ్యామ్ మూవీల కోసం భీమ్లానాయక్ రిలీజ్‌ను వాయిదా వేసుకోవలసిందిగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున తాము కోరగా భీమ్లానాయక్ నిర్మాత రాధాకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ వెంటనే అంగీకరించారని నిర్మాతలు దిల్‌ రాజు, డీవీవీ దానయ్యలు తెలిపారు. తమ చిత్రాల కోసం భీమ్లా నాయక్ రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నందుకు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ దర్శక నిర్మాతలు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.  

భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీన శివరాత్రికి విడుదల చేయబోతునట్లు నిర్మాత రాధాకృష్ణ ప్రకటించారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతున్నందున, అదే రోజు రిలీజ్ కావలసి ఉన్న ఎఫ్-3 మూవీని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు దాని నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా సర్కారువారి పాట సినిమా ఏప్రిల్ 1వ తేదీన విడుదల అవుతోంది. కనుక ఎఫ్-3 మూవీని ఏప్రిల్ 29కి ఫిక్స్ చేసుకొన్నామని నిర్మాత దిల్‌ రాజు చెప్పారు.

జూ.ఎన్టీఆర్-రామ్ చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌-రానా, వెంకటేష్-మహేష్ బాబు, వెంకటేష్-వరుణ్ తేజ్ తదితరులు ఎంతో స్నేహంగా మెలుగుతూ మల్టీస్టార్ సినిమాలు చేస్తూ ఓ ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తుంటే, దర్శకనిర్మాతలు కూడా ఈవిదంగా పరస్పరం సహకరించుకొంటూ తెలుగు సినీ పరిశ్రమను యావత్ దేశంలో సినీ పరిశ్రమలకు ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు వారందరికీ అభినందనలు. 


Related Post