తెలుగు సినీ పరిశ్రమలో 60 ఏళ్ళు వయసు వచ్చినా చాలామంది నటులు హీరో వేషాలే వేస్తూ చిట్టిపొట్టి దుస్తులు ధరించే కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తుంటారు. అయినా అదంతా నటనలో భాగమే అని సర్దిచెప్పుకొంటారు. అదే వారి కుటుంబాలలో నుంచి హీరోయిన్స్‌గా వచ్చినవారు మాత్రం ‘సంసార పక్షంగా మాత్రమే’ నటించాలని కోరుకోవడం లేదా అసలు సినీ పరిశ్రమలోకి రాకుండా ఉండటమే మంచిదన్నట్లు వ్యవహరిస్తుంటారు. అలాగే సినీ పరిశ్రమలో పెద్ద హీరోలు తమ కొడుకులను మాత్రమే వారసులుగా తీసుకువస్తుంటారు. (మంచు లక్ష్మి ఇందుకు మినహాయింపు). కానీ హీరోయిన్స్‌ను మాత్రం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుంటారు. ఎందుకంటే వారు చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తూ బోల్డ్‌గా నటించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు కనుక!
అలాగే హీరోయిన్స్‌గా కొనసాగాలంటే వారు పెళ్ళిళ్ళు చేసుకోకూడదనే అప్రకటిత నిబంధన సినీ పరిశ్రమలో ఉంది. కానీ హీరోలకు ఈ నిబంధన వర్తించదు. వారు పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా కాపురాలు చేసుకోవచ్చు. 60 ఏళ్ళు వయసు వచ్చినా హీరోలుగా విలంలను ఇరగతీస్తుండవచ్చు. కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయవచ్చు. ఒకవేళ హీరోల కుమారులు మళ్ళీ వారి కుమారులు కూడా ఎదిగి వస్తే వారితో కూడా కలిసి సినిమాలు చేసుకోవచ్చు. కానీ హీరోయిన్లు మాత్రం సినీ పరిశ్రమలో కొనసాగాలంటే పెళ్ళి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకొని మళ్ళీ సినిమాలు చేయాలనుకొంటే వారి జీవితాలను పణంగా పెట్టవలసిందే. గతంలో కూడా అనేక మంది హీరోయిన్ల జీవితాలు ఈ కారణంగానే నాశనం అయ్యాయి. ఇపుడు సమంత మన కళ్ళ ముందే ఉంది.
ఓహ్ బేబీ, రంగస్థలం, రాజుగారి గది-3 వంటి సినిమాలలో మహాద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకొన్న సమంత, ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్‌లో ఎల్‌టీటీఈ (శ్రీలంక) కార్యకర్తగా మహాద్భుతంగా నటించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. కానీ అదే వెబ్‌సిరీస్‌లో ఆమె కొన్ని బోల్డ్ సీన్స్ చేయడం అక్కినేని కుటుంబ సభ్యులకు నచ్చలేదని, అటువంటివి అక్కినేని కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని వారు వారించినప్పటికీ ఆమె చేయడంతో అది చివరికి విడాకులకు దారి తీసిందని ‘బాలీవుడ్ లైఫ్’ అనే వెబ్‌సైట్ పేర్కొంది.
ఇప్పుడు సమంత పుష్పలో "ఊ అంటావా మావా..ఊఊ అంటావా మావా...' అంటూ అల్లు అర్జున్ తో కలిసి ఐటెమ్ సాంగ్ చేసింది. ఆ పాటకు, సమంత డ్యాన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీని తరువాత సమంత 'అరేంజిమెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ సినిమాలో చాలా బోల్డ్ పాత్ర చేయబోతోంది. అంటే కుటుంబాన్ని, సంసార జీవితాన్ని వదులుకొంటేనే వృత్తిపరంగా స్వేచ్చ లభిస్తుందని, లేకుంటే ఎంత పెద్ద హీరోయిన్లకైనా కొన్ని పరిమితులకు లోబడే సినిమాలు చేయవలసి ఉంటుందని స్పష్టం అవుతోంది. దేశంలో సినిమాలు తీయడం మొదలైనప్పటి నుంచి నేటికీ హీరోయిన్ల పరిస్థితి ఇంతే. కనుక భవిష్యత్‌లో మారుతుందనుకోలేము కూడా.