కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు లోక్‌సభలో ఓటర్ కార్డు-ఆధార్ కార్డులను అనుసంధానించడానికి సంబందించిన బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి ఇటీవలే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటి అనుసంధానం ద్వారా బోగస్ ఓట్లకు అడ్డుకట్ట వేయడం, ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించవచ్చని కిరణ్ రిజుజు తెలిపారు. అయితే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీని వలన ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందని వాదించాయి. అయితే దేశ ప్రజలు స్వచ్ఛందంగా అనుసంధానం చేసుకొనే వెసులుబాటు ఈ బిల్లులో ఉందని, ఎవరినీ బలవంతంగా అనుసంధానం చేసుకోవాలని ఒత్తిడి చేయబోమని కిరణ్ రిజుజు చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఇతర అంశాలపై లోక్‌సభలో ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టక మునుపే సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
ఇప్పటికే బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోన్, రేషన్, సంక్షేమ పధకాలు వగైరాలు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడ్డాయి. కనుక ఈ బిల్లుతో ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందనే ప్రతిపక్షాల వాదన అర్ధరహితం.
కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు విదేశీ చొరబాటుదార్లకు ఆధార్, ఓటర్ కార్డులు ఇప్పిస్తూ తమ ఓటు బ్యాంక్ పెంచుకొంటున్నాయి. మరికొన్ని రాష్ట్రాలలో వేల సంఖ్యలో బోగస్ ఓటర్లున్నారు. ఓటర్ కార్డులను, ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే వారి ఓట్లన్నీ రద్దు అయిపోతాయి. బహుశః అందుకే ప్రతిపక్షాలు గోప్యత పేరుతో ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెపుతున్నట్లు భావించవచ్చు.