ఏపీలో మందుబాబులకు శుభవార్త!

December 18, 2021


img

ఏపీలో మందుబాబులకు శుభవార్త! మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ (పన్ను) తగ్గించింది. దీంతో బీర్లపై 10 నుంచి 20 శాతం, విదేశీ రకం మద్యం (బ్రాందీ, విస్కీ, రమ్ వంటి భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం) పై 5 నుంచి 12 శాతం వరకు, మిగిలిన అన్ని రకాల మద్యంపై గరిష్టంగా 20 శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ     రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి రేపటి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. కనుక వచ్చే వారం నుంచి రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలలో అన్ని ప్రముఖ కంపెనీలు, బ్రాండ్ల మద్యం విక్రయించాలని సూచించారు. రాష్ట్రంలో నాటుసారా తయారీ, విక్రయాలను అడ్డుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. 

ఇదివరకు రాష్ట్రంలో మద్యపానం తగ్గించేందుకు అంటూ ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచేసింది. అప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ధరలు పెంచడం, మద్యం దుకాణాలలో కొన్ని ఎంపిక చేసిన కంపెనీలు తయారుచేసే మద్యం మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై ప్రవహించింది. దీంతో ఏపీ ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు లబ్ది పొందాయి. 

అప్పుడు మద్యపానం తగ్గించేందుకు ధరలు పెంచామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నాటుసారా తయారీ, వినియోగాన్ని అడ్డుకోవడానికి ధరలు తగ్గిస్తున్నామని చెపుతోంది. మద్యం ధరలు తగ్గుతాయి కనుక రాష్ట్రమలో మందుబాబులు మరింత మద్యం తాగుతారిప్పుడు. మద్యం ధరలు తగ్గి అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయి. అంటే రాష్ట్రంలో మళ్ళీ మద్యపానం పెరుగుతుందన్నమాట! ముందు ధరలు పెంచడానికి, ఇప్పుడు తగ్గించడానికి ప్రభుత్వం చెపుతున్నవి కుంటి సాకులే అని అర్ధమవుతూనే ఉంది. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తికి మించి సంక్షేమ పధకాలను అమలుచేస్తుండటంతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీస్తోంది. అందుకే ఇప్పుడు ఈ వంకతో మద్యం ధరలు తగ్గించి మద్యం విక్రయాలు పెంచుకొని... వాటితో పాటే ఆదాయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలకు ముందు ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడం మందుబాబులందరికీ సంతోషం కలిగించే విషయమే! 


Related Post