నేడు విడుదలైన పుష్ప సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఊహించని బహుమతులు ఇచ్చింది. నేటి నుంచి డిసెంబర్ 30వరకు రోజుకు 5 షోలు వేసుకొనేందుకు అనుమతించడమే కాక అప్పటి వరకు టికెట్లపై రూ.50 చొప్పున పెంచుకొనేందుకు థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లను అనుమతించింది.
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ఇంతగా ఆదరించి ప్రోత్సహిస్తుంటే, పొరుగున ఏపీ ప్రభుత్వం మాత్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సినీ నియంత్రణ చట్టం తెచ్చి, షోలు, టికెట్ అమ్మకాలు, వాటి ధరలపై ఆంక్షలు విధిస్తూ సినీ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవేళ అదనపు షోలు వేస్తే థియేటర్ యజమానులపై కేసులు నమోదు చేస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు తదితరులలో చాలా మంది ఏపీకి చెందినవారే. మరి ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమపై కక్ష కట్టినట్లు ఎందుకు వ్యవహరిస్తోంది? అని సందేహం కలుగకమానదు.
సినీ పరిశ్రమలో చాలామంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ సంబంధాలు కలిగి ఉండటం, వారిలో చాలామంది వైసీపీ ప్రభుత్వం విభేధిస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉదాహరణకు బాలకృష్ణ టిడిపి, పవన్ కళ్యాణ్ జనసేనకు చెందినవారు.
తనపై రాజకీయ కక్షతో మిగిలినవారి సినిమాలను అడ్డుకొని వేదించవద్దని పవన్ కళ్యాణ్ కోరడం, అఖండ సినిమాను ఏపీలో పార్టీలకు అతీతంగా అందరూ ఆదరించారని బాలకృష్ణ చెప్పడం గమనిస్తే, ఏపీలో తెలుగు సినిమాల పరిస్థితి అర్ధమవుతుంది.
తెలంగాణ విడిపోయిన తరువాత టిఆర్ఎస్‌తో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీలో వైజాగ్‌కు తరలిపోవాలనుకొంది. అప్పుడు ఏపీలో సినీ పరిశ్రమతో చక్కటి సంబంధాలున్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం కూడా దీనికి ఓ కారణం. కానీ సినీ పరిశ్రమ తరలింపు వలన తీవ్రంగా నష్టపోతామని గ్రహించి హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. ఒకవేళ అప్పుడే సినీ పరిశ్రమవైజాగ్‌కు తరలిపోయుంటే నేడు దాని పరిస్థితి నేడు మరింత భయానకంగా ఉండేదేమో?
ఉద్యమ సమయంలో సినీ పరిశ్రమ పట్ల టిఆర్ఎస్ అనుచితంగా ప్రవర్తించినప్పటికీ తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా తన వైఖరిని మార్చుకొని అక్కున చేర్చుకొని ఆదరించింది. ఇది పుష్పతో మరోసారి నిరూపితమైంది. సినీ పరిశ్రమలో భారీ పెట్టుబడులతో తీస్తున్న సినిమాల వలన రాష్ట్రానికి భారీగా పన్నుల రూపంలో ఆదాయం, ఉపాధి అవకాశాలు, మంచి పేరు లభిస్తాయని గ్రహించినందునే టిఆర్ఎస్ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకొందని చెప్పవచ్చు. కానీ నేటికీ ఏపీ ప్రభుత్వం ఇంత చిన్న విషయాన్ని గ్రహించలేకపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
సినీ పరిశ్రమ వలన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల కంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమని భావించడం వలననే ఈవిదంగా వ్యవహరిస్తోందనుకోవాలేమో? తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి దేశవిదేశాలకు వ్యాపిస్తుంటే దాని పుట్టినింట్లో మాత్రం ఆంక్షలు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుండటం చాలా బాధాకరమే కదా?