కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలు ఏమిటంటే...

December 14, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ సోమవారం కాశీలో కొత్తగా నిర్మించిన తొలిదశ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు. దేశంలో హిందువులు అందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలనుకొంటారు. నేటికీ దేశంలో చాలా మంది తమ జీవితంలో చివరి రోజులు కాశీలో ముగించాలని కాశీకి వెళ్ళి అక్కడే ఉండిపోతుంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో చనిపోయినా వారి ఆస్తికలను కాశీలోని గంగానదిలో కలపడానికి వెళుతుంటారు. తద్వారా మోక్షప్రాప్తి, పునర్జన్మరాహిత్యం సిద్దిస్తుందని హిందువుల నమ్మకం.

ఇంతటి ప్రసిద్ధి చెందిన కాశీ పుణ్యక్షేత్రం దశాబ్ధాలుగా ఇరుకు సందులతో, ఎక్కడ చూసిన మురికి, దుర్వాసన, కాలుష్యంతో నిండి ఉండటం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చాలా ఆవేదన కలిగిస్తుంటుంది. కనుక కాశీకి (బనారస్)కు బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కాశీ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరాంగంగా, ఆహ్లాదకరంగా తీర్చి దిద్దాలని సంకల్పించారు. 2019లో కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు శంఖుస్థాపన చేశారు. రూ.339 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్‌ తొలిదశ పనులు పూర్తవడంతో ప్రధాని నరేంద్రమోడీ నిన్న ప్రారంభోత్సవం చేశారు. 

దీనికి అనేక ప్రత్యేకతలున్నాయి.

• ఈ కారిడార్‌ పూర్తిచేయడానికి కేంద్రప్రభుత్వం సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేయబోతోంది. దానిలో ఇప్పటికే రూ.339 కోట్లతో తొలి దశ పనులు పూర్తి చేసింది.  

• ఈ కారిడార్‌ ప్రధానోదేశ్యం కాశీలో గంగానది తీరాన్న గల అనేక ఘాట్స్ నుంచి నేరుగా ఆలయాన్ని చేరుకొనేందుకు వీలుగా విశాలమైన, సర్వసౌకర్యాలతో కూడిన వీధులు, రోడ్లు నిర్మించడం. ఎక్కడికక్కడ భక్తులు సేద తీరేందుకు, పూజలు, భజనలు చేసుకొనేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం. ఇరుకు, మురికి సందులతో కూడిన ఆలయ పరిసర ప్రాంతాల స్థానంలో సువిశాలమైన  5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయం చుట్టూ ప్రాకారాలతో, 23 భవనాలను నిర్మించారు.

ఈ ప్రాకారంలో క్యూ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో కాశీ విశ్వనాథ మందిరం 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దానిని 5 లక్షల చదరపు అడుగులకు పెంచడంతో రోజుకి 75 వేల మంది భక్తులు చాలా సులువుగా, సౌకర్యవంతంగా కాశీనాధుని దర్శించుకోవచ్చు. 

• క్యూ కాంప్లెక్స్ గోడలపై కాశీ మహాక్షేత్రం విశిష్టత, ఆలయ చరిత్ర, కాశీ విశ్వనాథుడి స్తోత్రాలు, హనుమాన్ చాలీసా, వివిద దేవతామూర్తుల శిల్పాలు, చిత్రపటాలు వగైరాలు ఏర్పాటు చేశారు. 
• ఆలయ ప్రాంగణంలో భరతమాత విగ్రహం, ఆది శంకరాచార్య విగ్రహం, అలనాడు కాశీ క్షేత్రాన్ని పునర్నిర్మించిన మహారాణీ అహల్యాబాయి హోల్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.      

• ఈ కారిడార్‌ నిర్మాణం కోసం మందిరం చుట్టూ ఉన్న వేలాది ఇళ్ళు, 1,400 దుకాణాలు తొలగించి వారికి పునరావాసం కల్పించారు. 

• ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాలలో గల 40 ఆలయాలను కూడా పునర్నిర్మించారు. 

కాశీ విశ్వనాథ మందిరం ఫోటోల కోసం లింక్: https://www.mytelangana.com/telugu/gallery/54/ 


Related Post