తమిళనాడు సిఎం స్టాలిన్‌తో నేడు సిఎం కేసీఆర్‌ భేటీ

December 14, 2021


img

సిఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సోమవారం తమిళనాడు, శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి జిల్లా కలెక్టర్‌, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “గతంలో కూడా ఓసారి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. తమిళనాడు ప్రభుత్వం ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేసింది. రేపు (మంగళవారం) తమిళనాడు సిఎం స్టాలిన్‌తో భేటీ అవుతాను,” అని చెప్పారు. 


ధాన్యం కొనుగోలు, బొగ్గు గనుల వేలంపై టిఆర్ఎస్‌ కేంద్రప్రభుత్వంతో యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిన్న ప్రకటించారు. సిఎం కేసీఆర్‌ నేడు తమిళనాడు సిఎం స్టాలిన్‌తో భేటీ కాబోయే ముందురోజు చేసిన ఆ ప్రకటన యాదృచ్ఛికం కాదని స్పష్టం అవుతోంది. కనుక ఈ భేటీలో సిఎం కేసీఆర్‌ తమ పోరాటానికి డీఎంకె పార్టీ మద్దతు కూడగట్టి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించవచ్చు. 

అధికార డీఎంకె పార్టీకి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉంది. కానీ సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలనుకొంటున్నారు. కనుక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఇది కూడా ఓ ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. మరి దీనిని ఏవిదంగా అధిగమిస్తారో చూడాలి.  


Related Post