కేంద్రంతో టిఆర్ఎస్‌ కయ్యం...ఎవరికి నష్టం?

December 11, 2021


img

ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో యుద్ధం మొదలుపెట్టిన టిఆర్ఎస్‌, తాజాగా సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రతిపాదనపై మరో యుద్ధం ప్రారంభిచింది. రాష్ట్రం నుంచి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని కోరడం, సింగరేణి పరిధిలో గల నాలుగు బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలనే టిఆర్ఎస్‌ డిమాండ్స్ చాలా సహేతుకమైనవే. కానీ ఈ వంకతో రాష్ట్రంలో బిజెపికి అడ్డుకట్ట వేయాలని  ప్రయత్నిస్తుండటంతో టిఆర్ఎస్‌ చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోంది. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓడిపోయినప్పటి నుంచే టిఆర్ఎస్‌ బిజెపిని లక్ష్యంగా చేసుకొని యుద్ధం ప్రారంభించిందని అందరికీ తెలుసు. ఒకవేళ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచి ఉండి ఉంటే టిఆర్ఎస్‌ కేంద్రంతో ఈ పోరాటాలు చేసి ఉండేదా?అని ఆలోచిస్తే కాదనే చెప్పవచ్చు.

రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు అడ్డుకట్ట వేయకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి అది మరింత బలపడుతుంది. ఒకవేళ అది అధికారం చేజిక్కించుకోలేకపోయినా టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. కానీ రాష్ట్రంలో బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మరో ఒకరిద్దరు బిజెపి నేతలపై టిఆర్ఎస్‌ ఏతలు విమర్శలు చేయడం తప్ప రాష్ట్ర బిజెపితో టిఆర్ఎస్‌ చేయగలిగే యుద్ధం ఏమీ లేదు. బహుశః అందుకే మోడీ ప్రభుత్వంతో యుద్ధం ప్రారంభించి, ‘బిజెపి ప్రభుత్వం’ రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తోందని గట్టిగా వాదిస్తోందని చెప్పవచ్చు. తద్వారా ప్రజలు తమవైపే ఉండేలా చేసుకోవాలని టిఆర్ఎస్‌ తాపత్రయపడుతున్నట్లు కనబడుతోంది. 

ధాన్యం కొనుగోలు, బొగ్గు గనుల వేలం సమస్యలపై టిఆర్ఎస్‌ చాలా బలంగా వాదనలు వినిపిస్తున్న మాట వాస్తవం. వీటితో టిఆర్ఎస్‌ రాజకీయంగా బిజెపిపై పైచేయి సాధించగలదేమో కానీ కేంద్రం పరిధిలో గల ఈ రెండు సమస్యలను పరిష్కరించలేదు. రాష్ట్ర బిజెపిపై పైచేయి సాధించే ప్రయత్నంలో వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది రైతులే.

సింగరేణి కార్మిక సంఘాల చేత సమ్మె చేయిస్తే సింగరేణి సంస్థ...కార్మికులు కూడా నష్టపోతారు.సమ్మె వలన సింగరేణిలో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచియింది. దీంతో సింగరేణికి రోజుకు రూ.60 కోట్లు నష్టం కలుగుతోంది. ఆ లెక్కన మూడు రోజులకు రూ.180 కోట్లు నష్టం కలుగుతుంది. ఇదీ వాస్తవం! కనుక ఈ రెండు సమస్యలను రాజకీయాలతో ముడి పెట్టకుండా పరిష్కరించుకోవడమే మంచిది లేకుంటే అంతిమంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమే.


Related Post