బూస్టర్ డోస్‌పై త్వరలో నిర్ణయం?

December 11, 2021


img

ఒమిక్రాన్‌ రూపంలో కరోనాను మళ్ళీ విరుచుకు పడుతుండటంతో రెండు డోసులు తీసుకొన్నవారు బూస్టర్ డోస్ తీసుకోవాలా...వద్దా?అని ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు ఆయోమయంలో ఉన్నారు. 

భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నందున కేంద్రప్రభుత్వం రెండు నిపుణుల బృందాల నుంచి బూస్టర్ డోస్‌పై సూచనలు, సలహాలు తీసుకొన్నాక నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్శుక్ మాండవీయ చెప్పారు. 

కేంద్రప్రభుత్వం అభ్యర్ధన మేరకు ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌) దీనిపై చర్చించి రెండు డోసులు తీసుకొన్న 9 నెలల తరువాత బూస్టర్ డోస్‌ ఇవ్వవచ్చని పార్లమెంటరీ కమిటీకి తెలియజేసింది. బూస్టర్ డోస్ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువు అయ్యిందని కనుక దాంతో ఒమిక్రాన్‌ వైరస్ సోకకుండా నివారించగలదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్ జనరల్ బలరామ్‌ భార్గవ చెప్పారు.  

అయితే నేటికీ దేశంలో ఒక్క డోస్‌ కూడా తీసుకొనివారు, రెండో డోస్‌కు తీసుకొనివారు కొన్ని కోట్లమంది ఉన్నారు. కనుక ముందుగా వారందరికీ వ్యాక్సినేషన్ చేయవలసి ఉంటుంది. అదే సమయంలో కేంద్రప్రభుత్వం బూస్టర్ డోస్‌కు ఆమోదం తెలిపితే రెండో డోస్‌ వేసుకొన్న కోట్లాదిమందికి మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించవలసి ఉంటుంది.  

శుక్రవారంనాటికి భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు 32కి చేరాయి. 


Related Post