తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్

December 08, 2021


img

తమిళనాడులో ఈరోజు మధ్యాహ్నం ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. దానిలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ (త్రివిద దళాల అధినేత) బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌, పలువురు ఆర్మీ ఉన్నతాధికారులతో సహా మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం. కోయంబత్తూరులో వెల్లింగ్టన్ వద్ద గల ఆర్మీ కంటోన్మెంట్‌ కేంద్రం నుంచి బయలుదేరి కూనూర్ వెళుతుండగా దారిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు సమాచారం. బిపిన్ రావత్ దంపతులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే ఆర్మీ, స్థానిక పోలీస్, అగ్నిమాపక, వైద్య సిబ్బంది అతికష్టం మీద ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పి, క్షతగాత్రులను బయటకు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. 

బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం ఏడు మంది ఢిల్లీ నుంచి ఆర్మీ విమానంలో ఈరోజు ఉదయం కోయంబత్తూరు చేరుకొన్నారు. అక్కడ నుంచి మరో ఏడుగురు ఆర్మీ సిబ్బంది వారితో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరారు.  

 బృందం ప్రయాణిస్తున్నది అత్యాధునిక ఎంఐ-17వి5 ఆర్మీకి చెందిన చాలా భారీ హెలికాప్టర్‌. ఇది అత్యంత కటినమైన వాతావరణం కూడా తట్టుకోగలదు. దీనిలో 21 మంది ప్రయాణించవచ్చు. బిపిన్ రావత్ వంటి వీవీవీఐపీ బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురవడంతో భారత్‌ వాయుసేన విచారణకు ఆదేశించింది. బిపిన్ రావత్ దంపతులు, మిగిలిన ఆర్మీ అధికారుల పరిస్థితి గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. 

ఢిల్లీ నుంచి బయలుదేరిన వారిలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయకు గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి.సాయితేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నట్లు వాయుసేన ప్రకటించింది.  

ఈ ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్రమంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపటిలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఈ ప్రమాదంపై పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం ఉంది.



Related Post