టిఆర్ఎస్‌-బిజెపిల యుద్ధంలో చివరికి ఓడేదెవరు?

December 08, 2021


img

ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మొదలైన యుద్ధం ఇప్పట్లో ముగిసేలాలేదు. పార్లమెంటులో ఆందోళనలు చేసి సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్‌ ఎంపీలు హైదరాబాద్‌ తిరిగివచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్ళబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే టిఆర్ఎస్‌ యుద్ధం కొనసాగించబోతోందన్న మాట! అప్పుడు బిజెపి కూడా ధీటుగానే స్పందిస్తుందని వేరే చెప్పక్కరలేదు. 

నిజానికి టిఆర్ఎస్‌ నుంచి బిజెపి కోరుకొంటున్నది కూడా సరిగ్గా ఇదే. ఎందుకంటే, టిఆర్ఎస్‌ తమను ఎంత బలంగా ఢీకొంటే రాష్ట్రంలో బిజెపికి పాపులారిటీ అంతగా పెరుగుతుంది. దాంతో రాష్ట్రంలో ఇంకా బలపడగలుగుతుంది. దుబ్బాక, గ్రేటర్, హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి విజయాలే ఇందుకు నిదర్శనాలు. గతంలో టిఆర్ఎస్‌ బిజెపిని పట్టించుకోనప్పుడు ఆ పార్టీ ఒక్క ఎన్నికలో కూడా గెలవలేకపోయింది. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచిందో అప్పుడే బిజెపి దాని స్థానంలోకి వచ్చింది. దాంతో బిజెపిని ఎదుర్కోకతప్పడం లేదు...అదే బిజెపికి కలిసి వచ్చింది.      

అసలు రెండు పార్టీల మద్య ఈ ఆధిపత్య పోరు ఎందుకు మొదలైంది? అంటే రాష్ట్రంలో హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరో రెండు మూడు దశాబ్ధాలు తామే రాష్ట్రంలో అధికారంలో ఉంటామని బలంగా నమ్ముతున్న టిఆర్ఎస్‌ అధిష్టానం హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ చేతిలో ఓడిపోవడంతో షాక్ అయ్యింది. దీంతో రాష్ట్రంలో బిజెపి క్రమంగా బలపడుతోందని గ్రహించడంతో వెంటనే అప్రమత్తమైంది. కనుక ఈ అంశం తీసుకొని పోరాటం మొదలుపెట్టి బిజెపి వలన రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని ప్రజలకు నచ్చజెప్పుతూ అందరినీ టిఆర్ఎస్‌కు కట్టుబడి ఉండేలా చేసుకోవాలని టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. 

అయితే కేంద్రప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే బాయిల్డ్ రైస్‌ కొనబోమని చెప్పడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇదే చెపుతోంది. కానీ ఆ రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడుపుతున్న ప్రాంతీయ పార్టీలు ఈవిదంగా కేంద్రంతో ఘర్షణ పడటం లేదు. కానీ టిఆర్ఎస్‌ ఒక్కటే పోరాడుతోంది. అంటే ఇది రాజకీయ ఆధిపత్యపోరు అని స్పష్టం అవుతోంది. 

ధాన్యం కొనుగోలు పేరుతో రెండు పార్టీల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరు ఇంకా కొనసాగితే ముందుగా నష్టపోయేది రైతులు...ఆ తరువాత బియ్యం ధరలు పెరిగి ప్రజలు నష్టపోవచ్చు. ఒకవేళ ఈ రాజకీయ ఆధిపత్యపోరు వలన బిజెపి ఇంకా బలపడితే అప్పుడు టిఆర్ఎస్‌ కూడా నష్టపోవచ్చు. కనుక తక్షణం దీనికి ముగింపు పలికి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం మొదలుపెడితే, కనీసం రైతులు టిఆర్ఎస్‌ పక్షాన్న నిలిచే అవకాశం ఉంటుంది.


Related Post