రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపివేశాం: కేంద్రమంత్రి

December 07, 2021


img

రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016, నవంబర్‌ అర్దరాత్రి నుంచి దేశంలో రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసిన తరువాత కేంద్రప్రభుత్వం రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది. అయితే 2018-19 ఆర్ధిక సంవత్సరం నుంచే వాటి ముద్రణ నిలిపివేశామని పంకజ్ చౌదరి తెలిపారు. అప్పటి నుంచి మార్కెట్లో రూ.2,000 నోట్ల చలామణి క్రమంగా తగ్గుతోందని చెప్పారు. 2018 మార్చి నుంచి 2019 వరకు 336.3 కోట్ల విలువగల 3.27 శాతం నోట్లు చలామణిలో ఉండగా, 2021 నవంబర్‌ నాటికి అవి రూ.223.3 కోట్లకు అంటే 1.7 శాతానికి తగ్గిందని తెలిపారు.   

అయితే మార్కెట్లో రూ.2,000 నోట్లు చలామణి తగ్గిందంటే అర్ధం అవి లేవని కాదని అందరికీ తెలుసు. కనబడకుండా ఉన్న ఆ సొమ్మంతా నల్లధనంగా మారి రాజకీయనాయకులు, వివిద రంగాల ప్రముఖుల ఇనప్పెట్టెల్లో దాగి ఉందని అందరికీ తెలుసు. ఇటీవల జరిగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలతో సహా దేశంలో వివిద రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల సమయంలో రూ.2,000 నోట్లు దర్శనమివ్వడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికలు జరిగినప్పుడు అవి బయటకు వచ్చి సామాన్య, మద్యతరగతి ప్రజలను ఓసారి పలకరించి మళ్ళీ ఆ ఇనప్పెట్టెల్లోకే వెళ్ళిపోతుంటాయి. కనుక రిజర్వ్ బ్యాంక్  ముద్రించి విడుదల చేసిన 336.3 కోట్ల విలువగల ఆ నోట్లను పూర్తిగా ఉపసంహరించుకోన్నప్పుడు మనకు కనబడనంత మాత్రన్న అవి లేవని అనుకోలేము కదా?


Related Post