వైరస్ నుంచి భార్యా పిల్లలకు విముక్తి కోసం హత్య

December 04, 2021


img

అవును...యూపీలో ఓ వైద్యుడు తన భార్యాపిల్లలకు ఒమిక్రాన్ వైరస్ సోకకుండా విముక్తి కల్పించేందుకు సుత్తితో తలలు పగులగొట్టి హత్య చేశాడు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ నగరంలో కళ్యాణ్ పూర్ అనే ప్రాంతంలో జరిగింది. 

డాక్టర్ సుశీల్ కుమార్‌ ఫోరెన్సిక్ డిపార్టుమెంట్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. గత ఏడాదిన్నర కాలంగా కరోనా బారినపడి మరణించినవారి శవాలను చూసి చూసి క్రమంగా ఓ రకమైన డిప్రెషన్‌లోకి జారుకొన్నాడు. అయితే ఆయన వైద్యుడు కావడంతో ఆయనలో ఈ మార్పును వృత్తిపరమైన ఒత్తిడిగా భావించారే తప్ప డిప్రెషన్‌లోకి జారుకొంటున్నాడని ఎవరూ పసిగట్టలేకపోయారు. అతనికి భార్య చంద్రప్రభ (48), శిఖర్ సింగ్‌ (17) అనే ఓ కుమారుడు, ఖుషీ సింగ్‌ (12) అనే ఓ కుమార్తె ఉన్నారు. 

కరోనా తీవ్రత తగ్గిన తరువాత మళ్ళీ సాధారణ జీవితం గడపవచ్చని భావిస్తున్న డాక్టర్ సుశీల్ కుమార్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందనే వార్తలు చాలా ఆందోళనకు గురి చేశాయి. వృత్తిరీత్యా వైరస్ సోకి చనిపోయిన మృతదేహాలను పరిశీలించడం ఆయన బాధ్యత కనుక తన ద్వారా తన కుటుంబ సభ్యులకు కూడా ఒమిక్రాన్ వైరస్ తప్పకుండా సోకుతుందని, అప్పుడు ఎవరూ ప్రాణాలతో బయటపడలేరనే భయం మొదలైంది. ఒమిక్రాన్ వైరస్ నుంచి తన కుటుంబానికి శాస్వితంగా విముక్తి కల్పించాలని గట్టిగా నిర్ణయించుకొన్న డాక్టర్ సుశీల్ కుమార్‌, శుక్రవారం సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఓ సుత్తి తీసుకొని మొదట భార్య తలపై గట్టిగా మోదాడు. ఆమె భయంతో ఆర్తనాదాలు చేస్తూ రక్తం మడుగులో విలవిలా కొట్టుకొంటుంటే పిల్లలు ఇద్దరూ కంగారుగా తల్లి వద్దకు వచ్చారు. వారిద్దరినీ కూడా డాక్టర్ సుశీల్ తలపై సుత్తితో మోది పారిపోయాడు. 

తరువాత తమ్ముడు సునీల్ సింగ్‌కు వాట్సాప్‌లో “వైరస్ నుంచి అందరికీ శాస్వితంగా విముక్తి కల్పించి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళి చూసి పోలీసులకు ఈ విషయం తెలియజేయి,” అని మెసేజ్ పంపించాడు. దాంతో అతను హడలిపోతూ పరుగున సోదరుడి ఇంటికి వెళ్ళగా అక్కడ రక్తపు మడుగులో చనిపోయున్న వదిన, ఆమె ఇద్దరు పిల్లలు కనబడ్డారు. 

పోలీసులు వచ్చి అక్కడే పడి ఉన్న సుత్తిని, డాక్టర్ సుశీల్ డైరీని స్వాధీనం చేసుకొని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు దొరికిన డైరీలో “ప్రతీరోజు కరోనాతో మరణించినవారి మృతదేహాలను లెక్కపెట్టి లెక్కపెట్టి అలిసిపోయాను. ఈ వైరస్ ఎవరినీ విడిచిపెట్టదు. అందరూ దీనికి బలైపోతారు,” అని డాక్టర్ సుశీల్ వ్రాసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగైదు బృందాలుగా ఏర్పడి డాక్టర్ సుశీల్ కోసం గాలింపు మొదలుపెట్టారు. తక్షణం అతనిని పట్టుకోకపోతే ఈ భయంతో ఇంకెంతమందిని ఈ ఒమిక్రాన్ వైరస్ భయంతో హత్యలు చేస్తాడో?అని అందరూ భయపడుతున్నారు.


Related Post