కాంగ్రెస్‌ మద్దతు లేకుండా బిజెపిని ఓడించడం అసాధ్యం: కేసీ వేణుగోపాల్

December 02, 2021


img

సిఎం కేసీఆర్‌ దేశంలో ప్రాంతీయ పార్టీలను కూడగట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలనుకొన్నారు. థర్డ్ ఫ్రంట్ కాంగ్రెస్‌,  బిజెపిలకు సమానదూరం పాటించాలని భావించారు. కానీ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు అటు బిజెపితోనో లేదా కాంగ్రెస్ పార్టీతోనో సంబంధాలు కలిగి ఉండటంతో ఆయన ఆలోచన ఫలించలేదు. 

ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ బిజెపియేతర పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆమె సిఎం కేసీఆర్‌లాగ కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకు పోవాలనే అనుకొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమె ప్రతిపాదనలకు సరిగ్గా స్పందించకపోవడంతో కాంగ్రెస్‌ లేకుండానే ఆమె థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఆమె బుదవారం నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ (మహారాష్ట్ర) అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో భేటీ అయ్యి బిజెపియేతర కూటమి ఏర్పాటు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె దేశంలో ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక్క తాటిపైకి తీసుకురాగలిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవచ్చునని అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ (కూటమి) ఇప్పుడు లేనేదన్నారు. 

దీంతో కాంగ్రెస్ ఇప్పుడు మేల్కొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ లేకుండా బిజెపిని ఓడించడం సాధ్యం కాదు. దేశంలో వాస్తవ రాజకీయ పరిస్థితి గురించి తెలుసున్నవారందరికీ ఈ విషయం బాగా తెలుసు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఒకవేళ కాంగ్రెస్ సహకారం లేకుండానే బిజేపీని ఓడించాలని ఎవరైనా భావిస్తే అది ఓ కలగానే మిగిలిపోతుంది," అని అన్నారు.   

ఈ ఏడేళ్లలో కాంగ్రెస్ పార్టీకి చాలా బలహీనపడినప్పటికీ నేటికీ దానికి దేశ వ్యాప్తంగా చాలా బలమైన నేతలు కార్యకర్తలు ఉన్నారు. అదీగాక జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కనుక వేణుగోపాల్ చెప్పినట్లు కాంగ్రెస్ సహాయసహకారాలు లేనిదే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొనడం సాధ్యం కాదని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కనుక ఇప్పటికైనా అహంభావం, భేషజాలు పక్కన పెట్టి స్నేహహస్తం అందించినప్పుడే థర్డ్ ఫ్రంట్ కల సాకారం అవుతుంది. 


Related Post