ప్రశాంత్ కిషోర్ బృందంతో సిఎం కేసీఆర్‌ చర్చలు?

December 02, 2021


img

దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తప్పకుండా వినిపించే పేరు ప్రశాంత్ కిషోర్. తొలిసారిగా ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరపున పనిచేసి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అప్పటి నుంచి ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. 

తాజా సమాచారం ప్రకారం ఆయనకు చెందిన ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పాక్‌) సభ్యులతో సిఎం కేసీఆర్‌ బుదవారం ప్రగతి భవన్‌లో భేటీ అయినట్లు తెలుస్తోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓడిపోవడంతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందా లేక బిజెపికి రాష్ట్రంలో ప్రజాధారణ పెరుగుతోందా? ప్రభుత్వం అమలుచేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకొంటున్నారు?టిఆర్ఎస్‌ పార్టీ యంత్రాంగం పనితీరు ఏవిదంగా ఉంది? తదితర అంశాలపై రాష్ట్రంలో సర్వే చేయించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఐ-పాక్‌ సర్వే నివేదిక ఆధారంగా టిఆర్ఎస్‌ పార్టీ, ప్రభుత్వం తదుపరి కార్యాచరణను రూపొందించుకోవాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు మళ్ళీ ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొకుండా నివారించవచ్చని సిఎం కేసీఆర్‌ భావిస్తునట్లు తెలుస్తోంది. అయితే ఐ-పాక్‌ బృందంతో సిఎం కేసీఆర్‌ భేటీని టిఆర్ఎస్‌ ఇంతవరకు దృవీకరించలేదు.   

దేశంలో అత్యుత్తమ ఎన్నికల వ్యూహ నిపుణులలో సిఎం కేసీఆర్‌ కూడా ఒకరు. అటువంటి ఆయనే ప్రశాంత్ కిషోర్ సాయం కోరడం నిజమైతే ఇంతకన్నా విచిత్రం ఉండదు. మరో విశేషమేమిటంటే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోకి విస్తరించాలని భావిస్తోంది. అందుకు ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ బృందం సేవలే పొందాలని భావిస్తోంది. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ కూడా తెలంగాణలో టిఆర్ఎస్‌ కోసం ఆయన సేవలేపొందాలనుకోవడం నిజమైతే ఇది మరో విశేషం. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ తరపున పనిచేస్తారో చూడాలి.


Related Post