టిఆర్ఎస్‌కు త్వరలో మరో షాక్?

December 01, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమితో పెద్ద షాక్ తిన్న టిఆర్ఎస్‌ పార్టీకి త్వరలో మరో షాక్ తగులబోతోంది. పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించాలని భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బృందంతో రహస్య సర్వే చేయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల బలాబలాలు, ఆ పార్టీలలో అసంతృప్త నేతల వివరాలు, టిఆర్ఎస్‌పై హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఓటమి ప్రభావం తదితర అంశాలపై సర్వే చేస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశించడం ఖాయమే కానీ ఇప్పటికిప్పుడు ఆ అవకాశం లేదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి టిఆర్ఎస్‌తో సహా భావస్వారూప్యత కలిగిన అన్ని పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆమె అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే గోవా, అస్సామ్, త్రిపుర, మేఘాలయ, యూపీ, బీహార్, హర్యానా రాష్ట్రాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేసుకొంటోంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించడం ఖాయమనే భావించవచ్చు. 

తెలంగాణలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ పార్టీలలో కొందరు అసంతృప్త నేతలు ఆ పార్టీలలో ఇమడలేక...ఆలాగని మతతత్వ బిజెపిలోకి వెళ్ళలేక ఇబ్బందిపడుతున్నారు. కనుక లౌకికవాదానికి కట్టుబడిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాజకీయ అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

సిఎం కేసీఆర్‌ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు మొట్ట మొదట పశ్చిమ బెంగాల్ వెళ్ళి సిఎం మమతా బెనర్జీతోనే భేటీ అయ్యారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని థర్డ్ ఫ్రంట్‌లో చేర్చుకోకూడదని భావిస్తున్నందున మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు అదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే టిఆర్ఎస్‌కు సవాల్ విసిరేందుకు సిద్దం అవుతుండటం విశేషం. తెలంగాణలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిలను కాదని ప్రజలు తృణమూల్‌ను ఆదరిస్తారా లేదా అనేది పక్కన పెడితే, రాష్ట్రంలో అటువంటి బలమైన పార్టీ ప్రవేశిస్తే టిఆర్ఎస్‌కు తప్పకుండా ఎంతో కొంత నష్టం కలగవచ్చు. 


Related Post