డాలర్ శేషాద్రి...వాస్తవాల కంటే అపోహలే ఎక్కువ

November 30, 2021


img

తిరుమల ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) డాలర్ శేషాద్రి మొన్న ఆదివారం విశాఖలో కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు గుండె పోటుతో మరణించారు. 1978లో టీటీడీలో గుమస్తాగా చేరి అంచెలంచెలుగా 2007లో పార్ పత్తేదార్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత ఓఎస్‌డీగా టీటీడీలో కొనసాగుతూ స్వామివారి నిత్యపూజలు, కైంకర్యాలలో పాల్గొన్నారు. 1978 నుంచి 2021లో మొన్న మరణించేవరకు కేవలం 15 నెలలు మినహా తిరుమల స్వామివారి సేవలోనే ఉన్నారు. 

తిరుమలకు ప్రముఖులు, వివివిఐపీలు ఎవరు వచ్చినా ఆయన వారి పక్కనే కనిపించేవారు. ఆలయంలో నిత్యపూజలు, ఊరేగింపులలో కూడా ఆయనే ప్రముఖంగా కనిపించేవారు. స్వామివారి బంగారు డాలర్ల విక్రయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు ఎదుర్కొన్నారు. నిత్యం పెద్ద బంగారు డాలర్ ధరించేవారు. ఇవన్నీ ఆయన పట్ల అపోహలు రేకెత్తించేలా చేయడంతో కొందరికి ఆయన పట్ల దురభిప్రాయం నెలకొని ఉండేది. కానీ ఇంతకాలం ఆయనతో సన్నిహితంగా పనిచేసిన ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు చెప్పినవి వింటే డాలర్ శేషాద్రి గురించి ప్రజలకు తెలిసిన వాస్తవాల కంటే అపోహలు, అనుమానాలే ఎక్కువని అర్ధమవుతుంది. 

డాలర్ శేషాద్రి బార్య పేరు చంద్రమ్మ. వారికి పిల్లలు లేరు. ఆయనకు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అందరిలాగే ఆయనకూ అనేకమంది బంధువులున్నారు. కానీ తిరుమలలో ఇంత కీలకమైన వ్యక్తిగా ఉన్న డాలర్ శేషాద్రి ఏనాడూ బంధుప్రీతి చూపలేదు. ఎవరికీ ఎటువంటి సిఫార్సులు చేసేవారుకారు. స్వామివారిని దర్శించుకోవాలంటే సామాన్య భక్తులతో పాటు క్యూలైన్లో రావడమే సరైనదని వారికి చెప్పేవారని ఆలయ సిబ్బంది చెప్పారు. 

ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు మెడలో బంగారు డాలర్ ధరించేవారు. అయితే స్వామివారి బంగారు డాలర్ల అమ్మకంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినప్పటి నుంచే అందరి దృష్టి ఆయన ధరించే ఆ బంగారు డాలర్‌ లాకెట్‌పై పడింది. ఇదీ అపోహలకు ఓ కారణమని చెప్పవచ్చు. కానీ ఆ ఆరోపణలపై లోతుగా దర్యాప్తు జరిపినప్పుడు ఆయన ప్రమేయం ఏమీ లేదని తేలింది. 

తిరుమలలో ఇంత కీలక వ్యక్తిగా ఉన్న డాలర్ శేషాద్రి తలుచుకొంటే భారీగా ఆస్తులు కూడబెట్టవచ్చు. విలాసవంతమైన ఇళ్ళు కట్టుకొని అందులో దర్జాగా జీవించవచ్చు. కానీ ఆయన తిరుమల కొండపైనే స్వామివారి ఆలయానికి సమీపంలో ఓ చిన్నగదిలో నివాసం ఉండేవారు. రోజులో ఎక్కువ సమయం ఆలయంలోనే గడిపేవారు. నిద్రపోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికో తన గదికి వెళుతుండేవారని సిబ్బంది చెప్పారు. స్వామివారి పట్ల అంత అంకితభావంతో పనిచేసేవారు. ఆయన ఆలయంలో పని చేసేవారు అని చెప్పడం కంటే స్వామివారి సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొన్నారని చెప్పవచ్చు. న్యాయవివాదాలలో చిక్కుకొనప్పుడు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు  కొంతకాలం స్వామివారికి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు ఆయన పడిన మనోవేదన బహుశః ఎవరూ అనుభవించి ఉండరని ఆలయ సిబ్బంది చెప్పారు. 

ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యపూజలు, కైంకర్యాలు, అలంకరణలు, వాహన సేవల విషయంలో డాలర్ శేషాద్రి ఒక డిక్షనరీ వంటివారని అందరూ చెపుతుంటారు. ఎప్పుడు ఎటువంటి పూజలు చేయాలి ఏవిదంగా చేయాలి... స్వామివారికి ఎటువంటి సేవలు చేయాలి...కైంకర్యాలు ఏవిదంగా చేయాలి... వాహన సేవలు... స్వామి వారి అలంకరణలు వంటి అన్ని పనులను ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకొనేవారు. అందుకే ఈ అంశాలపై ఆయన వ్రాసిన పుస్తకాలను టీటీడీ మూడు భాగాలుగా పుస్తక రూపంలో ముద్రించింది. 

ఇక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, గవర్నర్లు, దేశ విదేశీ ప్రముఖులు ఎవరు వచ్చినా వారిని డాలర్ శేషాద్రి సాధారంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించేవారు. ఈ కారణంగా వారితో పరిచయాలు ఏర్పడేవి. ఆ పలుకుబడితోనే ఆయన తిరుమలలో మళ్ళీ పదవులు సంపాదించుకొన్నారనే అపోహలు కూడా నెలకొని ఉన్నాయి. కానీ స్వామివారి సేవ పట్ల ఆయనకున్న అంకితభావం, అపార అనుభవం, సేవలు, అలంకరణలు, కైంకర్యాలు తదితర అంశాలపై ఆయనకున్న పట్టు కారణంగానే టీటీడీయే ఆయన ఆలయంలో ఉండటం చాలా అవసరమని భావించినందునే ఆయన శ్రీవారి సమక్షంలో కొనసాగారని ఆలయ అధికారులు చెపుతుంటారు. 

డాలర్ శేషాద్రికి దేశవిదేశాల నుంచి, ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు వస్తున్నప్పటికీ తిరుమల శ్రీవారిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేక సున్నితంగా ఆ ఆహ్వానలను తిరస్కరిస్తుండేవారని తోటి అర్చకులు చెప్పారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఎక్కడికైనా వెళ్లవలసివస్తే అక్కడ నిర్వాహకులు ఆయనకు విలాసవంతమైన హోటల్స్, రిసార్ట్స్, ఫాంహౌసులలో బస ఏర్పాటు చేసినా అక్కడ ఉండేందుకు ఇష్టపడేవారు కారని ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వామివారి ఆలయాలకు సంబందించిన కాటేజీలలో బస చేస్తుండేవారని తెలిపారు. 

డాలర్ శేషాద్రి నిత్యం బంగారు డాలర్ ధరిస్తారు కనుక ఆయనకు బంగారు ఆభరణాలపై చాలా వ్యామోహం ఉండి ఉండవచ్చనే దురభిప్రాయం చాలామందిలో నెలకొని ఉంది. కానీ ఆయన వద్ద ఆ ఒక్కటీ తప్ప మరే ఆభరణం లేదు. ఒకవేళ ఎవరైనా డబ్బు, బంగారు నగలు, బట్టలు, శాలువాలు, బహుమతులు ఇవ్వబోయినా వాటిని ఆయన స్వీకరించేవారుకారని ఆలయ సిబ్బంది తెలిపారు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఇస్తే వాటిని వెంటనే పంచిపెట్టేసేవారని లేదా స్వామివారికే సమర్పించేవారని తెలిపారు. 

ఈవిదంగా అత్యంత నిరాడంబరంగా జీవిస్తూ స్వామివారిని సేవించుకొనేవారు. ఆయన చిట్ట చివరి ఘడియలు కూడా విశాఖలోని టీటీడీ కళ్యాణ మండపంలో ముగియడం విశేషం. అక్కడ స్వామివారి విగ్రహం ఎదుట ఆయన నిద్రిస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయారు. డాలర్ శేషాద్రి 43 ఏళ్లపాటు తిరుమల శ్రీవారికి సేవలు చేసి తన జన్మ ధన్యం చేసుకొన్న ధన్యజీవి.


Related Post