కిషన్‌రెడ్డి దద్దమ్మ...పీయూష్ గోయల్‌కు సిగ్గులేదు: కేసీఆర్‌

November 30, 2021


img

సిఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మళ్ళీ కేంద్రప్రభుత్వంపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రధాని నరేంద్రమోడీ రైతులను గోస పెట్టి, 750 మంది రైతుల ప్రాణాలు బలితీసుకొని, చివరికి వ్యవయసాయ చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పారు. అంటే కేంద్రప్రభుత్వం వ్యవసాయ విధానాలు సరిలేదని ఇది నిరూపిస్తోంది. ఇప్పుడు పంజాబ్ రైతులకు క్షమాపనలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ రేపు ఏదో ఓ రోజున తెలంగా రైతులకు తప్పకుండా క్షమాపనలు చెప్పవలసి వస్తుంది. ఇది ఖాయం. మోడీ ప్రభుత్వం రైతులు బలిగొన్న ప్రభుత్వం. కనుక దేశంలో రైతులను కాపాడుకోవాలంటే బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. 

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ చాతకాని దద్దమ్మ. ఆయన తెలంగాణకు చెందినవారైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండా, పిచ్చిమాటలు మాట్లాడుతున్నారు. 

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2016లో భారత్‌ 96 స్థానంలో ఉండగా ఇప్పుడు అది 101 దిగజారింది. అదే...బంగ్లాదేశ్, నేపాల్ ర్యాంకులు 76, పాకిస్థాన్‌ ర్యాంక్ 92 ఉన్నాయి. అంటే ఆ దేశాల కంటే మన దేశం పరిస్థితి దిగజారిందని స్పష్టం అవుతోంది. అయినా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మా మంత్రులు, ఎంపీలు, అధికారులు ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడేందుకు ఆయన కార్యాలయానికి వెళ్తే “మీకెవరికీ పనీపాటు లేదా?” అంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడి అవమానించారు. 

అంతకు ముందు నేను ఆయనను కలిసినప్పుడు కిషన్‌రెడ్డి తీరు గురించి చెప్తే ‘కిషన్‌రెడ్డికి వ్యవసాయం గురించి ఏమీ తెలీదు. ఆయన అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని నాతో చెప్పారు. అయినా కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి నేతల తీరు మారలేదు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే ధాన్యం కొనుగోలుపై బహిరంగ చర్చకు రావాలని నేను సవాల్ చేస్తున్నాను లేకుంటే కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాలి.

విద్యుత్ చట్టాల విషయంలో కూడా మేము కేంద్రప్రభుత్వానికి పలు సూచనలు చేశాము. ఇక్కడ రాష్ట్రంలో రైతులకు మా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంటే, కేంద్రప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోంది. మీకు అంతగా ముచ్చటగా ఉంటే మీ బిజెపి పాలిత రాష్ట్రాలలో దానిని అమలుచేసుకోండి. అంతేగానీ మా ప్రభుత్వంపై పీక మీద కత్తిపెట్టి మేము కూడా రైతులకు అన్యాయం చేయమని ఎందుకంటున్నారు? రైతులకు అండగా నిలబడి వారికి సాయం చేయాల్సిందిపోయి వారి జీవితాలతో చెలగాటం ఆడుతాంమంటున్న ఈ బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకొంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే. అసలు ఈ ఏడేళ్ళలో నరేంద్రమోడీ ప్రభుత్వం దేశంలో ఏ వర్గానికి మేలు చేసింది? మోడీ ప్రభుత్వం దేశంలో ఏమి అభివృద్ధి సాధించింది? చెప్పగలరా? ఇదొక దరిద్రపుగొట్టు ప్రభుత్వం. ముందుచూపులేని, సామాజిక బాధ్యత లేని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇది. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉన్న దేశంలో చిచ్చు పెడుతోంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న భారత్‌ను ఏదో రోజు బిజెపి ప్రభుత్వం నిలువునా ముంచేయడం ఖాయం. కనుక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించకతప్పదు,” అని అన్నారు. 


Related Post