ట్విట్టర్‌కు సీఈఓగా భారతీయుడు

November 30, 2021


img

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇప్పుడు ట్విట్టర్‌... ఒక్కో అంతర్జాతీయ సంస్థ భారతీయుల మేధాశక్తిని, కష్టపడి పనిచేసే గుణాన్ని గుర్తించి తమ సంస్థలను వారి చేతుల్లో పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ కలిగిన సామాజిక మాద్యమం ట్విట్టర్‌ సీఈఓగా భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్‌ (45) నియమింపబడ్డారు. ఇప్పటి వరకు సీఈఓగా వ్యవహరిస్తున్న ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. ట్విట్టర్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్స్ సమావేశంలో పరాగ్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ట్విట్టర్‌లో ఈ అత్యున్నతమైన పదవి చేపట్టక మునుపు పరాగ్ అగర్వాల్‌ ట్విట్టర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీఓటి)గా పనిచేశారు.   

పరాగ్ అగర్వాల్‌ ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆ తరువాత కొంతకాలం మైక్రోసాఫ్ట్, యాహూ సంస్థలలో పనిచేశారు. 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేరి తన ప్రతిభా పాటావాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019నాటికి కంపెనీ సీఓటిగా నియమితులయ్యారు. ఇప్పుడు ట్విట్టర్‌ పగ్గాలు చేపట్టారు.    

ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతో సహా డైరెక్టర్స్ అందరూ పరాగ్ అగర్వాల్ మంచి పనితనం, నాయకత్వ లక్షణాలు కలిగిన సమర్దుడైన వ్యక్తి అని గట్టిగా నమ్ముతుంటారు. ముఖ్యంగా క్లిష్ట సమయాలలో ట్విట్టర్‌కు అండగా నిలబడి ముందుకు నడిపించిన తీరును జాక్ డోర్సే చాలా ప్రశంసించారు. పరాగ్ అగర్వాల్‌ నాయకత్వంలో ట్విట్టర్‌ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.               

పరాగ్ అగర్వాల్‌ అర్ధాంగి పేరు వినీత అగర్వాల్. ఆమె అండ్రీసేన్ హోరోవిట్జ్ అనే వెంచర్ క్యాపిటల్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. పరాగ్, వినీత్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. 


Related Post