ఆదిలాబాద్‌ నామినేషన్ల ఉపసంహరణలో హైడ్రామా

November 27, 2021


img

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 12 స్థానాలను పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలుచుకోవాలనే టిఆర్ఎస్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కవిత (నిజామాబాద్‌), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్‌), పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు (రంగారెడ్డి), కాశిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి (మహబూబ్‌నగర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్లు కూడా అందజేశారు. కానీ మిగిలిన ఆరు స్థానాలలో కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఎన్నికలు తప్పలేదు.     

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా నామినేషన్లు దాఖలవడంతో టిఆర్ఎస్‌ నేతలు వారికి నచ్చజెప్పి నామినేషన్లు ఉపసంహరింపజేశారు. కానీ ‘తుడుం దెబ్బ’ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన పుష్పరాణిని పోటీలో నుంచి తప్పించడానికి టిఆర్ఎస్‌ నేతల ప్రయత్నాలను బిజెపి నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమె నామినేషన్ ఉపసంహరించుకొన్నారని సంపత్ కుమార్‌ అనే ఓ వ్యక్తి రిటర్నింగ్ అధికారులకు చెప్పాడు. కానీ ఆమె నామినేషన్ ప్రతిపాదించినవారిలో అతని పేరు లేకపోవడంతో అధికారులు ఆమె నామినేషన్ ఉపసంహరించడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తల మద్య సాయంత్రం వరకు వాదోపవాదాలు, ఘర్షణలు జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఆమె కూడా పోటీలో ఉండటంతో ఎన్నికలు అనివార్యం అయ్యింది. 

ఇక ఖమ్మం, మెదక్‌ ఎమ్మెల్సీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండటంతో ఇక్కడా ఎన్నికలు జరుగనున్నాయి. కరీంనగర్‌లో రెండు స్థానాలకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌తో సహా మొత్తం 10 మంది బరిలో మిగిలారు కనుక ఇక్కడా ఎన్నికలు అనివార్యం అయ్యాయి.  ఇక నల్గొండలో ఒక్క స్థానానికి టిఆర్ఎస్‌ అభ్యర్ధి కోటిరెడ్డితో సహా నగేష్, లక్ష్మయ్య, మరో నలుగురు స్వతంత్ర అభ్యర్ధులతో కలిపి మొత్తం ఏడుగురు పోటీలో మిగిలారు. కనుక ఇక్కడా ఎన్నికలు తప్పలేదు.


Related Post