దళిత బంధు ఊసే లేదేమిటో?

November 24, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరిగే వరకు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ నిత్యం దళిత బంధు పధకం గురించే ఎక్కువగా మాట్లాడారు. దళిత బంధు పధకాన్ని బిజెపి అడ్డుకొంటోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎన్ని అవరోధాలు సృష్టించినా దళిత బంధు పధకాన్ని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని బల్లగుద్ది గట్టిగా వాదించారు. సిఎం కేసీఆర్‌ సైతం హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముగియగానే నియోజకవర్గంలో అన్ని దళిత కుటుంబాలకు ఈ పధకం అమలుచేస్తామని, తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు చొప్పున ఈ పధకాన్ని అమలుచేస్తామని, దీని కోసం బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు.   

హుజూరాబాద్‌ ఉపఎన్నిక అయిపోయింది. ఫలితాలు వెలువడి మూడు వారాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు టిఆర్ఎస్‌లో ఎవరూ దళిత బంధు పధకం అమలు గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు దానిని అమలుచేయకుండా ఎవరూ టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం లేదు. కనుక తక్షణం అమలుచేయవచ్చు. కానీ ఆనాడు బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ధిక మంత్రి హరీష్‌రావు సైతం ఇప్పుడు దళిత బంధు పధకం గురించి మాట్లాడటం లేదు! 

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత టిఆర్ఎస్‌ పార్టీ ‘ధాన్యం కొనుగోలు’ అంశాన్ని తెరపైకి తెచ్చి దాని కోసం కేంద్రంతో పోరాటం మొదలుపెట్టింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వంలో...పార్టీలో అందరూ ధాన్యం కొనుగోలు, కేంద్రం వివక్ష, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. 

ఈ విషయంలో తాము వెనకబడిపోతామేమో అనే భయంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ధాన్యం కొనుగోలు సమస్యకు షిఫ్ట్ అయిపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో దళిత బంధు పధకం అమలు గురించి అడిగేవాడేలేరు. కనుక ప్రభుత్వం దానిన్ని ఎప్పటి నుంచి అమలుచేస్తుందో తెలీని పరిస్థితి. దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్రంలో దళిత కుటుంబాలు అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. 


Related Post