ఏపీ మూడు రాజధానులు కధ సమాప్తం?

November 22, 2021


img

ఏపీ మూడు రాజధానుల కధ ఈరోజు సమాప్తం అయ్యింది. ఈరోజు శాసనసభలో దానికి సంబందించిన బిల్లును వెనక్కు తీసుకొంటున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు. వెంటనే దీనిపై సభలో ఓటింగ్ జరిపి బిల్లును అటకెక్కించింది కూడా. రాష్ట్రానికి... ప్రజలకు ఎంతో మేలు చేయాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ బిల్లును తెస్తే ఆనాటి నుంచి దీనిపై ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారం చేస్తూ, కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుపడ్డాయని సిఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగా ప్రజలలో కూడా మూడు రాజధానులపై అనేక అపోహలు, అనుమానాలు మొదలయ్యాయని కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ బిల్లును వెనక్కు తీసుకొంటున్నామని సిఎం జగన్ చెప్పారు. దీనిపై ఏర్పడిన పలు అనుమానాలను నివృత్తి చేస్తూ, సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు లేకుండా మరింత స్పష్టమైన బిల్లును మళ్ళీ రూపొందిస్తామని సిఎం జగన్ చెప్పారు. 

అయితే మూడు రాజధానుల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఎన్ని సమస్యలు ఎదుర్కొందో సిఎం జగన్ స్వయంగా సభలో చెప్పారు. కనుక మళ్ళీ అటువంటి ఆలోచన చేయరని భావించవచ్చు. ఈ సమస్యలకు తోడు కేంద్రప్రభుత్వం (బిజెపి) కూడా మళ్ళీ అమరావతికే మొగ్గు చూపడం మొదలుపెట్టింది. కనుక కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళడం ఇష్టం లేకనే సిఎం జగన్ మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గారని చెప్పవచ్చు. అయితే సిఎం జగన్ ఈ బిల్లును వెనక్కు తీసుకొంటున్నట్లు ప్రకటించారు కానీ ‘ఇక నుంచి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని’ మాత్రం చెప్పలేదు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం “ఇంకా సినిమా పూర్తవలేదు...ఇది ఇంటర్వెల్ మాత్రమే,” అని అన్నారు. కనుక ఈ మూడు రాజధానుల కధ సమాప్తమా...సశేషమా? అనేది ఎవరికీ తెలియని పరిస్థితి. ఇదెలా ఉందంటే “ఆపరేషన్ సక్సస్ బట్...పేషంట్‌ ఈజ్ డెడ్‌!” అన్నట్లుంది.


Related Post