కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకే ఈ సన్నాహాలా?

November 20, 2021


img

మొన్న ఇందిరా పార్కులో జరిగిన టిఆర్ఎస్‌ మహాధర్నాలో సిఎం కేసీఆర్‌ మాట్లాడిన మాటలను నిశితంగా గమనిస్తే ఆయన ఈ సమస్యపై పోరాటాల ద్వారా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారా?అనే అనుమానం కలుగక మానదు. 

ఇంతకీ సిఎం కేసీఆర్‌ ఏమన్నారంటే, “యావత్ దేశంలో రైతుల పరిస్థితి ఇలాగే దయనీయంగా ఉంది. వారందరి కోసం మనం పోరాడక తప్పదు. అసమర్ధ పాలకులను గద్దె దించితేనే దేశానికి విముక్తి లభిస్తుంది. దేశం కోసం పోరాడేందుకు టిఆర్ఎస్‌, తెలంగాణ రాష్ట్రం కూడా సిద్దంగా ఉన్నాయి. టిఆర్ఎస్‌కు, తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి మారకపోతే రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో బిజెపికి చావు డప్పు కొట్టేందుకు వెనకాడబోము,” అని తీవ్రంగా హెచ్చరించారు. 

ధాన్యం కొనుగోలుపై బిజెపి-టిఆర్ఎస్‌, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వాదనలు పక్కన పెడితే, రెండూ తమ వైఖరికే కట్టుబడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నందున ఈ సమస్య ఇప్పట్లో తేలేదికాదని స్పష్టం అవుతోంది. కనుక సిఎం కేసీఆర్‌ హెచ్చరిస్తున్నట్లు కేంద్రప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా పోరాటం తప్పదని స్పష్టం అయ్యింది. అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ధర్నాలు, దీక్షలు చేస్తే ఫలితం ఉండదు కనుక దేశంలో బిజెపియేతర రాష్ట్రాలను కలుపుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అంటే సిఎం కేసీఆర్‌ దీంతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడానికి సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్తే రాష్ట్రానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు.


Related Post