ప్రధాని నరేంద్రమోడీ నిన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం హటాత్తుగా ఈవిషయంలో ఎందుకు వెనక్కు తగ్గడానికి వేరే కారణాలున్నాయి. కానీ తమ పోరాటాల వల్లనే కేంద్రం వెనక్కు తగ్గిందని బిజెపియేతర పార్టీలు చెప్పుకొంటున్నాయి.
సిఎం కేసీఆర్ ధర్నా చేసిన మర్నాడే ప్రధాని మోడీ స్వయంగా ఈ ప్రకటన చేయడంతో టిఆర్ఎస్ నేతలు ఇది తమ అధినేత వల్లే జరిగిందని చెప్పుకొంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న హైదరాబాద్‌లో సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ ఒక్కరోజు హైదరాబాద్‌లో ధర్నా చేసేసరికి కేంద్రం దిగివచ్చింది. అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తానని సిఎం కేసీఆర్ హెచ్చరించడంతో ప్రధాని మోడీ హడావుడిగా వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిఎం కేసీఆర్ ఒక్కసారి రంగంలో దిగితే ఏమవుతుందో ప్రధాని నరేంద్రమోడీకి కూడా తెలుసు. అందుకే వ్యవసాయ చట్టాలపై వెనక్కు తగ్గారు. ధాన్యం కొనుగోలుపై కూడా కేంద్రం దిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదు,” అని అన్నారు.
కాంగ్రెస్, వామపక్షాలతో సహా వివిద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఇది రైతుల విజయం అని చెపుతున్నప్పటికీ తమ పోరాటాల వలననే కేంద్రం దిగివచ్చిందని చెప్పుకొంటున్నాయి. అంటే ప్రధాని మోడీ ఓటమి అంగీకరించి అందరినీ గెలిపించారన్న మాట!