ధాన్యం సమస్యపై ధర్నాలు...తడిసి ముద్దవుతున్న ధాన్యం

November 18, 2021


img

రాష్ట్రంలో ఓ పక్క అకాల వర్షాలతో మార్కెట్‌ యార్డులకు తెచ్చిన ధాన్యం తడిసిపోతుంటే రైతులు దానిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మరో పక్క ధాన్యం సేకరణ, కొనుగోలు సమస్యపై టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు చేస్తూ రాజకీయ ఆధిపత్య పోరులో మునిగిపోయారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో తప్పు మీదంటే మీదంటూ ఒక పార్టీని మరొక పార్టీ విమర్శించుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయి. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డును చూస్తే రైతుల దుస్థితి అర్దమవుతుంది. బుదవారం హటాత్తుగా భారీ వర్షం కురవడంతో మార్కెట్‌ యార్డుకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. వాటిపై టార్పాలిన్లు కప్పినప్పటికీ మిగిలిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దాంతో కొందరు రైతులు వర్షం నీటిని ఎత్తిపోస్తుంటే మరికొందరు తడిసిన ధాన్యాన్ని వేరు చేయసాగారు. 

కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించుకొని భద్రంగా వినియోగదారులవరకు చేర్చి అమ్ముకోగలుగుతున్నాయి. కానీ రైతులు మాత్రం దుక్కి దున్నడం  మొదలుపెట్టినప్పటి నుంచి ధాన్యం అమ్ముకునే వరకు రేయింబవళ్ళు ఇలా కష్టపడుతూ ఆందోళనతోనే బ్రతకుతున్నారు. వారు అప్పులు చేసి కష్టపడి పండించిన పంటకు కనీసం ధర నిర్ణయించుకొనే అధికారం వారికి లేదు. అయినకాడికి అమ్ముకొందామంటే ఇదిగో...ఇలా రాజకీయాలు సాగుతున్నాయి. వారి సమస్యలను పరిష్కరించవలసిన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు... వాటిని నడుపుతున్న బిజెపి, టిఆర్ఎస్‌లే ధర్నాలు చేస్తుంటే ఇక రైతులు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలీని పరిస్థితి.



Related Post