టిఆర్ఎస్‌, బిజెపి..మద్యలో కాంగ్రెస్ హడావుడి

November 18, 2021


img

ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌, బిజెపిలు పరస్పరం కత్తులు దూసుకొంటుంటే, అంతర్గత కలహాలలో మునిగిపోయున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ యుద్ధంలో వెనకబడిపోయింది. టిఆర్ఎస్‌, బిజెపిల మద్య ఇదే స్థాయిలో రాజకీయ యుద్ధం కొనసాగుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత తగ్గిపోతుంది. బహుశః అందుకే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా ఈ ధాన్యం పేరిట జరుగుతున్న యుద్ధంలో తెలంగాణ ప్రభుత్వంపై పోరాడేందుకు శంఖారావం పూరించారు. 

రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో పండిన ప్రతీ బియ్యపు గింజను తెలంగాణ ప్రభుత్వమే కొంటుందని రైతులకు భరోసా ఇచ్చిన టిఆర్ఎస్‌ ఇప్పుడు ధాన్యం కొనకుండా కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఓ పక్క రైతులు ధాన్యం కుప్పల దగ్గర పడిగాపులు కాస్తుంటే టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ డ్రామాలు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ధాన్యం కొనుగోళ్ళు మొదలుపెట్టి రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్‌, పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమీషనరేట్ కార్యాలయం వరకు వేలాదిమంది రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తాము. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ధాన్యం కొనుగోలు చేసేవరకు రైతుల తరపున తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతాము,” అని రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు మొదలు గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు అందరూ నేడు ఇందిరా పార్క్ వద్ద ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా మహాధర్నా చేయబోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తుండటం విశేషం. మరోపక్క రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా జిల్లాలలో పర్యటిస్తూ రైతులను కలుస్తూ వారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈవిదంగా మూడు పార్టీలు ధాన్యం కొనుగోలు పేరిట  రాజకీయ ఆధిపత్యపోరులో పరస్పరం కత్తులు దూసుకొంటుంటే అకాల వర్షాలతో ధాన్యం కూడా తడిసిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 


Related Post