బిజెపి కూడా ఇదే కోరుకొంటోంది కదా?

November 17, 2021


img

ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధంతో అసలు సమస్య  పక్కకుపోయింది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలిచి ఉంటే సిఎం కేసీఆర్‌ ఈ పోరాటం మొదలుపెట్టేవారో లేదో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం కేంద్రప్రభుత్వం, బిజెపిలపై కత్తులు దూసి యుద్ధానికి సై అంటున్నారు. 

విశేషమేమిటంటే బిజెపి నేతలు కూడా సరిగ్గా ఇదే కోరుకొంటున్నారు. ఇంతకాలం బిజెపి విమర్శలను టిఆర్ఎస్‌ పెద్దగా పట్టించుకొనేది కాదు. దాంతో వారు ఒంటి చేత్తో చప్పట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలో దిగి బిజెపితో యుద్ధానికి సిద్దపడ్డారు కనుక రాష్ట్రంలో బిజెపి మరింత యాక్టివ్ అయ్యేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ యుద్ధం పుణ్యామని బిజెపి నేతలకు, పార్టీకి ప్రజలలో మరింత గుర్తింపు, ప్రజాధారణ లభిస్థాయి. కనుక అందరూ ఇప్పుడు మరింత ఉత్సాహంతో టిఆర్ఎస్‌ను ఢీకొంటారు. కనుక రాష్ట్ర బిజెపిని టిఆర్ఎస్‌ ఎంత గట్టిగా ఎదుర్కొంటే బిజెపికి అంత మేలు జరుగుతుంది. 

ఈ విషయం సిఎం కేసీఆర్‌కు తెలియదనుకోలేము. కానీ దుబ్బాక, గ్రేటర్, హుజూరాబాద్‌ ఎన్నికలతో రాష్ట్రంలో క్రమంగా బలపడుతున్న బిజెపిని ఇప్పుడే అడ్డుకోవాలి లేకుంటే వచ్చే ఎన్నికలనాటికి మరింత బలపడి టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుపడవచ్చనే ఉద్దేశ్యంతోనే బిజెపిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. 

కానీ బిజెపి రబ్బరు బంతి వంటిది. దానిని ఎంత గట్టిగా గొడకేసి కొడితే అంతకు రెట్టింపు వేగంతో తిరిగి దూసుకువస్తుంటుంది. తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలాసార్లు చెప్పారు. వారు ఏదో కాలక్షేపానికి ఆ మాట చెప్పలేదని అందరికీ తెలుసు. వారు కూడా రాష్ట్రంలో సరిగ్గా ఇటువంటి రాజకీయ వాతావరణం ఏర్పడటం కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సిఎం కేసీఆరే స్వయంగా అది సృష్టిస్తున్నారు కనుక కేంద్రప్రభుత్వం, బిజెపి అధిష్టానం రెండూ రాష్ట్ర బిజెపి నేతలకు పూర్తి సహాయసహకారాలు అందించవచ్చు. 

ఇది కూడా సిఎం కేసీఆర్‌ ముందే ఊహించారు. అందుకే ‘కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఆదాయపన్ను, ఈడీ దాడులు జరిపిస్తుందని’ అని అన్నారు. 

ధాన్యం కొనుగోలు పేరుతో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మొదలైన ఈ యుద్ధం బహుశః వచ్చే శాసనసభ ఎన్నికలకు యుద్ధభేరి వంటిదని భావించవచ్చు. చివరికి ఈ యుద్ధంలో ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే ఎన్నికలు వరకు వేచి చూడాల్సిందే.  


Related Post