సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో 18న ఇందిరా పార్క్‌ వద్ద టిఆర్ఎస్‌ ధర్నా

November 16, 2021


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి సంచలన ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం, బిజెపిల ద్వందవైఖరికి నిరసనగా గురువారం మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ సభ్యులు తదితరులందరూ ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ధర్నా ముగిసిన తరువాత అందరూ పాదయాత్రగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ధాన్యం కొనుగోలు వ్యవహారంపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. రెండు రోజులలో కేంద్రం స్పందించకపోతే భవిష్య కార్యాచరణ ప్రకటిస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వెళ్ళి రైతుల చేతిలో అవమానాలు పాలయ్యాడని అయినా సిగ్గు లేకుండా నన్ను అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నాడని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పుకొంటున్నారని కానీ 70 లక్షల మంది పార్టీ కార్యకర్తలలో లక్షలాది రైతులు కూడా ఉన్నారనే సంగతి ఆయనకు తెలియదా?అని సిఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. టిఆర్ఎస్‌ కార్యకర్తలైనంత మాత్రన్న వారు రైతులు కాకుండా పోతారా? తమకు కేంద్రం అన్యాయం చేస్తోందని తెలిసి బండి సంజయ్‌ను నిలదీయకుండా ఉంటారా?అని సిఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెపుతుంటే బండి సంజయ్‌ రైతుల దగ్గరకు వెళ్ళి ధాన్యం పండించమని చెపుతున్నాడని, పండించిన ధాన్యాన్ని రాష్ట్రమే కొనాలని రైతులను ఉసిగోల్పే ప్రయత్నం చేస్తున్నారని అందుకే రైతులకు ఒళ్ళుమండి ఆయనకు నిరసనలు తెలియజేశారని అన్నారు. బండి సంజయ్‌కు తగిన శాస్తి జరిగిందని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని అడిగినప్పటికీ పట్టించుకోకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం, పైగా రాష్ట్రంలో బిజెపి ఈ కొత్త డ్రామా మొదలుపెట్టి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్నే విమర్శిస్తుండటం సరికాదని సిఎం కేసీఆర్‌ అన్నారు. కనుక ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కేంద్రాన్ని, రాష్ట్ర బిజెపి నేతలను వెంటబడతామని, సమస్య పరిష్కారం అయ్యేవరకు విడిచిపెట్టబోమని సిఎం కేసీఆర్‌ స్పష్టం చెప్పారు.


Related Post