ఇలాగైతే కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: పొన్నం

November 13, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమిపై నేడు గాంధీభవన్‌లో సమీక్షా సమావేశం జరుగుతోంది. దానిలో పాల్గొన్న పార్టీ  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కె.కేశవరావు, డీ శ్రీనివాస్ ఇద్దరూ ఎంపీ టికెట్ తీసుకొని తరువాత కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని, ఇప్పుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా అదే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించకుండా తన కజిన్ బ్రదర్ కౌశిక్ రెడ్డి గురించి మాత్రమే ఆలోచిస్తూ టిఆర్ఎస్‌లోకి పంపించి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించుకొంటున్నారని ఆరోపించారు. పార్టీలో చాలా మంది పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచించకుండా వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమికి నేతల మద్య సమన్వయం లేకపోవడమే కారణమని కానీ సమీక్షా సమావేశంలో తనను బాధ్యుడిని చేయాలని ప్రయత్నిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిదంగా వాస్తవాలు మాట్లాడినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సిద్దమేనని, దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ సవాల్ కూడా విసిరారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య ఏ స్థాయిలో పోరాటం జరిగిందో అందరికీ తెలుసు. ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని అందరికీ తెలుసు. కనుక మళ్ళీ ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టుకోవడం దేనికి? పెట్టుకొని ఈవిదంగా పరస్పరం నిందించుకొని ప్రయోజనం ఏమిటి?హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని పార్టీలో అందరికీ ముందే తెలుసు. అందుకే ఎవరూ పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. ఎన్నికల సమయంలో మొహం చాటేసి ఇప్పుడు సమీక్షా సమావేశాలలో కూర్చొని ఎంత మాట్లాడుకొని ఏమి ప్రయోజనం? పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు కాంగ్రెస్‌ నేతల తీరు మారకపోతే వచ్చే ఎన్నికలలో కాదు...ఎన్నికల కంటే ముందే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. 


Related Post