హైదరాబాద్‌లో నాలుగు మెడికల్ టవర్స్: హరీష్‌

November 13, 2021


img

రాష్ట్రంలో సాగునీటి శాఖను ఓ గాడిలో పెట్టి రాష్ట్రమంతటా నీళ్ళు పారించి చూపిన మంత్రి హరీష్‌రావు ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను కూడా ఆ స్థాయిలో తీర్చిదిద్దడానికి సిద్దం అవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖను చేపట్టిన తరువాత మంత్రి హరీష్‌రావు పలు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో వైద్యసదుపాయాలు మరింత మెరుగు పరిచేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి నలువైపులా నాలుగు మెడికల్ టవర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 

మంత్రి హరీష్‌రావు శుక్రవారం హైదరాబాద్‌ నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూని ప్రారంభించారు. రూ.33 కోట్లు ఖర్చు చేసి మరో 800 పడకలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా మొదటి రెండు దశలను చాలా సమర్ధంగా ఎదుర్కొందని, ఒకవేళ మూడో దశ వస్తే దానినీ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.133 కోట్లు కేటాయించి అన్ని సన్నాహాలు చేసుకొని సిద్దంగా ఉందని తెలిపారు. కేసీఆర్‌ కిట్స్ పధకం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు 30 నుంచి 50 శాతానికి పెరిగాయని తెలిపారు.   

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, మౌలికవసతుల కల్పన, పరిశ్రమలు, పెట్టుబడులు, వైద్య రంగాలపై ప్రధానంగా దృష్టిపెట్టి చాలా అభివృద్ధి చేసింది. కరోనా ప్రవేశించక మునుపే రాష్ట్రంలో పటిష్టమైన వైద్య వ్యవస్థ, ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలు ఉండేవి. కరోనా నేర్పిన గుణపాఠాలతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసి మరింత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆసుపత్రులలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకొనే ప్లాంట్స్, జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు వగైరా ఏర్పాటు చేసింది. 

ఉద్యోగాలు ఉపాధి కోసం ఏపీతో సహా పలు రాష్ట్రాల నుంచి ఏవిదంగా ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారో అదేవిదంగా కరోనా సమయంలో చికిత్స కోసం వివిద రాష్ట్రాల నుంచి రోగులు అంబులెన్సులో రావడం అందరూ చూశారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇది తెలియజేస్తోంది. ఇప్పుడు మంత్రి హరీష్‌రావు దానిని ఇంకా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించడం చాలా సంతోషకరమైన విషయమే.


Related Post