కేసీఆర్‌ నేర్పిన విద్యలే: బండి సంజయ్‌

November 12, 2021


img

హుజూరాబాద్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ ‘సిఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలను నోటికి వచ్చినట్లు తిట్టడం చూసే మేము నేర్చుకొన్నామని’ అని అన్నారు. అదొక్కటే కాదు...వివిద అంశాలపై బిజెపి నేతల వాదనలు, వారి పోరాటాలు, ఆరోపణలు చూస్తున్నప్పుడు టిఆర్ఎస్‌ రాజకీయ, ఎన్నికల వ్యూహాలను కూడా వారు బాగానే ఆకళింపు చేసుకొన్నట్లు అర్దమవుతుంది. 

అధికార పార్టీలు రాజకీయాలలో హుందాతనం, నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఒక మెట్టు దిగితే ప్రతిపక్షాలు రెండు మెట్లు దిగుతాయని ఇదివరకే చెప్పుకున్నాము. టిఆర్ఎస్‌, బిజెపిల మద్య నడుస్తున్న తాజా యుద్ధాలు చూస్తే ఇది అర్దమవుతుంది. పలు అంశాలు, సమస్యలు, హామీలపై టిఆర్ఎస్‌ ఏవిదంగా వ్యవహరించిందో, ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఎటువంటి వ్యూహాలను అమలుచేసిందో ఇప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు, ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర బిజెపి నేతలు పచ్చి అబద్దాలు చెపుతున్నారని టిఆర్ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు...టిఆర్ఎస్‌ నేతలే అబద్దాలు చెపుతున్నారని బిజెపి నేతలు వాదిస్తున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో బిజెపి నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారనుకుంటే వారే రైతులతో కలిసి ధర్నాలు, ర్యాలీలు చేస్తూ టిఆర్ఎస్‌కు సవాల్ విసురుతున్నారు. అలాగే తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని టిఆర్ఎస్‌ వాదిస్తుంటే, రాష్ట్రంలో అన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోందని గట్టిగా వాదిస్తూ టిఆర్ఎస్‌ వాదనలను కొట్టిపడేస్తున్నారు. 

చివరికి బీబీ నగర్‌లోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలం కేటాయింపు, కృష్ణాగోదావరి జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యూనల్ ఏర్పాటు వంటి అంశాలలో కేంద్రమంత్రులు జోక్యం చేసుకొని టిఆర్ఎస్‌ ప్రభుత్వానిదే అంతా తప్పని గట్టిగా వాదిస్తున్నారు. కానీ టిఆర్ఎస్‌, బిజెపి వాదనలలో నిజానిజాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. టిఆర్ఎస్‌ అమలుచేసిన వ్యూహాలనే బిజెపి నేతలు ఔపొసన పట్టి టిఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారని అర్దమవుతోంది. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదన్నట్లు మాట్లాడే టిఆర్ఎస్‌ నేతలకు బిజెపి బలమైన ప్రత్యామ్నాయమని నిరూపించి చూపుతున్నారు. కేవలం ఏడేళ్ళలో రాష్ట్రంలో ఇంత రాజకీయమార్పు, ఇన్ని కొత్త పార్టీలు, పాదయాత్రలతో వాటి హడావుడి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే...వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి రాష్ట్ర రాజకీయాలపై టిఆర్ఎస్‌ మళ్ళీ పూర్తి పట్టు సాధించలేకపోతే ఎదురీత తప్పదనిపిస్తోంది.


Related Post