కేంద్రంతో టిఆర్ఎస్‌ యుద్ధాలు...పర్యవసానాలు?

November 12, 2021


img

ధాన్యం కొనుగోలు సమస్యపై ప్రస్తుతం టిఆర్ఎస్‌, బిజెపిల మద్య యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధ ప్రకటన చేయడానికి కారణాలు ఏమిటి? అనే ప్రశ్నకు హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓటమితో దెబ్బ తిన్న తన ప్రతిష్టను పునరుద్దరించుకోవడానికి...ఓటమిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి...భవిష్యత్‌లో జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని...అనే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రధాని నరేంద్రమోడీతో, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో సన్నిహితంగా మెలిగే సిఎం కేసీఆర్‌ చేస్తున్న ఈ యుద్ధాలు నిజమైనవి కావని రేవంత్‌ రెడ్డి వాదిస్తున్నారు.

ఒకవేళ టిఆర్ఎస్‌ చెప్పుకొంటున్నట్లు ఇవి నిజమైన పోరాటాలే అయితే వీటితో సిఎం కేసీఆర్‌ ఏమి సాధించాలనుకొంటున్నారు? వీటి పర్యవసనాలు తెలుసుకొనే చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

రాష్ట్రంలో బిజెపి బలపడుతోందని దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు నిరూపించాయి. కనుక బిజెపికి అడ్డుకట్టవేసేందుకు సిఎం కేసీఆర్‌ మళ్ళీ తెలంగాణవాదాన్ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. అప్పుడే రాష్ట్ర ప్రజలందరినీ మళ్ళీ టిఆర్ఎస్‌ వైపు మళ్లించవచ్చు. “పంజాబ్ ధాన్యం కొంటున్న కేంద్రప్రభుత్వం తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదు?”వంటి టిఆర్ఎస్‌ వాదనలను వింటే ఇది అర్దమవుతుంది. 

రెండో ప్రశ్న టిఆర్ఎస్‌ పోరాటాల పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయనే దానికి సమాధానంగా ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడు మన కళ్ళ ముందే ఉన్నారు. కేంద్రప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వినందుకు ఆయన ఎంత భారీ మూల్యం చెల్లించారో అందరూ చూశారు. అయితే  కేంద్రం తనను ‘టచ్‌ చేయలేదని’ కేసీఆర్‌ చెప్పారు. అది వేరే విషయం. 

కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే మిషతో టిఆర్ఎస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంతో గొడవ పెట్టుకొంటే నష్టపోయేది రాష్ట్రమూ...ప్రజలే తప్ప కేంద్రమూ కాదు...టిఆర్ఎస్‌ పార్టీ కాదని అందరికీ తెలుసు. ఇందుకు పొరుగు రాష్ట్రం ఏపీ ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది.   

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, శాంతిభద్రతలు ఉన్నందునే భారీగా పెట్టుబడులు, కంపెనీలు, పరిశ్రమలు తరలివస్తున్నాయి. కానీ టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మొదలైన ఈ రాజకీయ ఆధిపత్యపోరులో భాగంగా రెండు పార్టీలు, మరోపక్క కాంగ్రెస్‌ తదితర పార్టీలు పోటాపోటీగా ఉద్యమాలు, ర్యాలీలు, ఆందోళనలు చేస్తుంటే ఏమవుతుంది? అంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తారని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ రాజకీయ యుద్ధాల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని అర్దమవుతోంది.

ఈ ఏడేళ్ళలో సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఇటుక మీద ఇటుక పేర్చుతూ ఇల్లు నిర్మించినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది. కానీ ఇప్పుడు కేంద్రంతో రాజకీయ యుద్ధాలు చేస్తుంటే తాము నిర్మించిన ఈ బంగారు సౌధాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే చేజేతులా కూల్చుకొన్నట్లవుతుంది. కనుక టిఆర్ఎస్‌ సంమయమనం పాటించడమే పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ప్రజలకు అందరికీ కూడా మంచిది. 


Related Post