టిఆర్ఎస్‌, బిజెపి పోటాపోటీగా ధర్నాలు

November 12, 2021


img

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై టిఆర్ఎస్‌, బిజెపిలు రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నాయి. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కేంద్రప్రభుత్వమే కొనాలని టిఆర్ఎస్‌ వాదిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని బిజెపి వాదిస్తోంది. రెండు పార్టీలు ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ధర్నాలు చేస్తున్నప్పటికీ, అసలు కారణం మాత్రం వాటి మద్య మొదలైన రాజకీయ ఆధిపత్య పోరే అని అందరికే తెలుసు. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు ఈవిదంగా భిన్న వాదనలు వినిపిస్తూ ధర్నాలు చేస్తుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రెండు పార్టీలు తమ సమస్యను పరిష్కరించకుండా దానిపై రాజకీయాలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఈవిదంగా రాజకీయాలు చేస్తుంటే అకాల వర్షాలకు చేతికి వచ్చిన తమ పంట ఎక్కడ నాశనం అయిపోతుందో అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనుక టిఆర్ఎస్‌, బిజెపిలు నిజంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే తక్షణం ఈ ధర్నాల డ్రామాలు కట్టిపెట్టి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరిస్తే అందరూ హర్షిస్తారు. 


Related Post