దళిత బంధుతో టిఆర్ఎస్‌, బిజెపిలు రచ్చరచ్చ

November 11, 2021


img

దళిత బంధు పధకంపై రాష్ట్రంలో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పధకాన్ని తక్షణం అమలుచేయాలని కోరుతూ బిజెపి డప్పులు మోగిస్తూ ర్యాలీలు చేస్తుంటే, ఈ పధకానికి అడ్డొస్తే బిజెపిని తొక్కెస్తాం...అని టిఆర్ఎస్‌ హెచ్చరిస్తోంది. ఈ పధకాన్ని అమలుచేయాలని బిజెపి కోరుతుంటే తప్పకుండా అమలుచేస్తామని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. అంటే రెండు పార్టీలు దళిత బంధు పధకం అమలవ్వాలనే కోరుకొంటున్నాయని అర్ధమవుతోంది. మరి ఎందుకు గొడవపడుతున్నాయి? 

దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్ధికభారం పడుతుంది కనుక దానికి నిధులు సమకూర్చుకొని అమలుచేయడం చాలా కష్టం. కానీ ఈ పధకంతోనే టిఆర్ఎస్‌ ప్రతిపక్షాలపై రాజకీయంగా పైచేయి సాధించాలనుకొంది కనుక దీనినే ఆయుధంగా చేసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ టిఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈవిషయం టిఆర్ఎస్‌కు కూడా తెలుసు కనుక ఆత్మరక్షణ కోసం దళిత నాయకుడిగా గుర్తింపున్న మోత్కుపల్లి నర్సింహులును ముందుకు తీసుకువచ్చింది. ఆయన బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.   

బుదవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దళిత బంధుకు అడ్డొస్తే బిజెపిని తొక్కెస్తాం. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సిఎం కేసీఆర్‌ మానవతాదృక్పదంతో రాష్ట్రంలో దళితులకు మేలు చేసేందుకు ఈ పధకం అమలుచేస్తుంటే దానిని ఏదోవిదంగా అడ్డుకొని ఎత్తేయించాలని బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తవగానే సిఎం కేసీఆర్‌ ఈ పధకాన్ని పక్కన పెట్టేస్తారని అబద్దాలు ప్రచారం చేసిన దుర్మార్గుడు బండి సంజయ్‌. కానీ ఉపఎన్నిక పూర్తవగానే సిఎం కేసీఆర్‌ ఈ పధకం కోసం వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున దళిత కుటుంబాలకు ఈ పధకాన్ని అమలుచేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే ఈ పధకాన్ని బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అమలుచేయాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. మహనీయుడు, మానవతావాది అయిన సిఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోము,” అని హెచ్చరించారు. 


Related Post