సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ధర్నాలు చేస్తే...

November 10, 2021


img

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రైతులతో ధర్నాలు నిర్వహించాలని అధికార టిఆర్ఎస్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో రైతుల నుంచి కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలుచేయనందుకు నిరసనగా ధర్నాలు చేయాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి ముందుగా అనుమతి తీసుకొని ధర్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 



ఇది ధాన్యం కొనుగోలుకు సంబందించిన సమస్య కాగా టిఆర్ఎస్‌, బిజెపిలు దీనిని రాజకీయ సమస్యగా మార్చేశాయి. ఓ పక్క రైతులు చేతికి వచ్చిన ధాన్యం అమ్ముకోలేక తీవ్ర ఆందోళన చెందుతుంటే, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మాట్లాడుకొని వారి సమస్యను పరిష్కరించకుండా, మళ్ళీ రైతుల సమస్యల పరిష్కారం కోసమంటూ టిఆర్ఎస్‌, బిజెపిలు రెండు పార్టీలు పోటాపోటీగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నాయి. 

రాజకీయ పార్టీలు తమ సమస్యలను పరిష్కరిస్తాయని భావించి ప్రజలు వాటిని ఎన్నుకొని అధికారం అప్పజెపుతారు. కానీ టిఆర్ఎస్‌, బిజెపిలు తమ బాధ్యతను మరిచి రాజకీయ ఆధిపత్యపోరులో మునిగిపోయాయి. వాటి పోరులో రైతులు నలిగిపోతున్నారు. ఈ ధర్నాలు, దీక్షలతో తమ ప్రత్యర్ద పార్టీలను ఇరుకున పెట్టేందుకు ఉపయోగపడతాయి తప్ప రైతుల సమస్యలు పరిష్కారంకావని అందరికీ తెలుసు. ఇందుకు ఉదాహరణగా ఏడాదిగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. నేటికీ వేలాదిమంది రైతులు రోడ్లపైనే ఉన్నారు. వారి సమస్యపై కాంగ్రెస్, బిజెపీలు వాదించుకొంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాయి. 

కనుక ఇకనైనా టిఆర్ఎస్‌, బిజెపిలు విజ్ఞతతో వ్యవహరించి తక్షణం రైతుల సమస్యలను పరిష్కరిస్తే మంచిది లేకుంటే రాష్ట్రంలో వరి రైతుల ఆత్మహత్యలు మొదలవుతాయి. వాటికి టిఆర్ఎస్‌, బిజెపిలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.


Related Post