కేంద్రప్రభుత్వంపై కేసీఆర్‌ ఎందుకు నిప్పులు చెరుగుతున్నారు?

November 09, 2021


img

ఎన్నడూ లేనివిదంగా సిఎం కేసీఆర్‌ 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కేంద్రప్రభుత్వంపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడటం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సిఎం కేసీఆర్‌ కేంద్రంపై హటాత్తుగా బాణాలు ఎక్కుపెట్టడానికి కూడా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 

కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేసినందున రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బియ్యం/ ధాన్యం కొనుగోలు చేయడానికి వెనకడుగువేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి కేంద్రప్రభుత్వమే కారణం అయినప్పటికీ రాష్ట్ర బిజెపి నేతలు దీక్షలు, విమర్శలతో రైతుల ముందు కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వరి పండించిన రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో రాష్ట్ర బిజెపి నేతలు చేస్తున్న హడావిడితో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కనుక రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేసి వారి ఆగ్రహాన్ని కేంద్రప్రభుత్వంపైకి మళ్ళించేందుకే సిఎం కేసీఆర్‌ కేంద్రంపై బాణాలు సందిస్తున్నారనుకోవచ్చు. 

ఇక సిఎం కేసీఆర్‌ కేంద్రంపై నిప్పులు చెరగడానికి అందరూ ఊహిస్తున్న మరో కారణం కూడా ఉంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓటమి సిఎం కేసీఆర్‌ ఓటమిగానే అందరూ భావిస్తున్నారు. కనుక వీలైనంత త్వరగా ప్రజల దృష్టిని దీనిపై నుంచి వేరే అంశంపైకి మళ్ళించడం చాలా అవసరం లేకుంటే బిజెపి నేతల విమర్శలు, ఆరోపణలతో కేసీఆర్‌ ప్రతిష్ట మరింత దెబ్బ తింటుంది. దాంతో పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బ తింటుంది. టిఆర్ఎస్‌లో కేసీఆర్‌పై అపనమ్మకం ఏర్పడితే టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలను బిజెపిలోకి ఫిరాయింపజేయడం సులువవుతుంది. అదీగాక ఇప్పటికే బిజెపి చాలా రెచ్చిపోతోంది దానిని వెంటనే కట్టడి చేయవలసి ఉంది. బహుశః ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే సిఎం కేసీఆర్‌ 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కేంద్రప్రభుత్వం మీద విరుచుకుపడ్డారని భావించవచ్చు. లేకుంటే ఎప్పటిలాగే తన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేత బండి సంజయ్‌కి జవాబు చెప్పించి ఉండేవారు. 


Related Post