పదవీ విరమణ విషయంలో జోక్యం చేసుకోలేము: హైకోర్టు

November 06, 2021


img

తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికల హామీలో భాగంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 పెంచుతూ జీఓ జారీ చేసింది. 2021, మార్చి 31 నుంచి ఇది అమలులోకి వచ్చింది. కానీ దీని వలన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని కనుక ఆ జీవోను ఉపసంహరించుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌సీ శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వాటిపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెపుతూ పిటిషన్లన్నిటినీ కొట్టివేసింది. 

ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం ఉద్యోగులకు సంతోషం కలిగించవచ్చు కానీ వారినే కొనసాగిస్తుండటం వలన కొత్తగా నియామకాలు ఉండవు. కనుక ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూస్తున్న నిరుద్యోగులకు ఇది నిరాశ కలిగించే విషయమే. పైగా ప్రభుత్వం 65 వేల ఉద్యోగాల భర్తీ అంటూ ఊరిస్తోంది తప్ప ఇంతవరకు నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన ప్రభుత్వం అదేవిదంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నట్లయితే వారికి ఎంతో కొంత ఉపయోగపడేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కానీ కొత్తగా దళిత బంధు పధకంతో రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు పదేసి లక్షలు చొప్పున ఇస్తామని చెపుతోంది!


Related Post