ఇప్పుడు బంతి టిఆర్ఎస్‌ కోర్టులోనే ఉంది: బిజెపి

November 05, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కేంద్రానిదే బాధ్యత అని పదేపదే నిందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం, ప్రతిపక్షాలు దీనిని ఆయుధంగా ప్రయోగిస్తుండటంతో కేంద్రప్రభుత్వం వాటిపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. బిజెపి పాలిత రాష్ట్రాలు మరో అడుగు ముందుకు వేసి వాటిపై వ్యాట్ పన్నును కూడా కొంత తగ్గించుకోవడంతో ఆయా రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. 

అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం ఇంతవరకు వ్యాట్ పన్ను తగ్గించకపోవడంతో వాటి ధరలు ఎక్సైజ్ తగ్గింపు మేరకే తగ్గాయి. కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి నేతలు ఇప్పుడు అధికార పార్టీలను నిలదీస్తున్నారు. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందుకు కేంద్రాన్ని నిందించారు కదా...కేంద్రం తన వాటాగా ఎక్సైజ్ సుంకం తగ్గించి సామాన్య ప్రజలకు ఊరట కలిగించే ప్రయత్నం చేసింది. మరి మీరెందుకు వ్యాట్ పన్ను తగ్గించడం లేదని నిలదీస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ఎన్నికలలో రాజకీయ లబ్ది కోసం వాడుకొన్నప్పుడు, ధరలు తగ్గించాల్సిన సమయం వచ్చినప్పుడు ఎందుకు వెనకాడుతున్నారు?ప్రజల బాధలు మీకు పట్టావా?అంటూ బిజెపి నేతలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తక్షణం వ్యాట్ తగ్గించుకోవాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. మరి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు వ్యాట్ పన్ను తగ్గించుకొంటాయా లేదా? త్వరలోనే తెలుస్తుంది. 



Related Post